బీర్భూమ్ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని, రాష్ట్రంలో రాజకీయ హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీర్భూమ్ ప్రాంతంలో మమతా బెనర్జీ గురువారం పర్యటించారు.
”ఆధునిక బెంగాల్లో ఇంత అనాగరికం జరుగుతుందని నేను అనుకోలేదు. తల్లులు, పిల్లలు చనిపోయారు. మీ కుటుంబీకులు చనిపోయారు. నా గుండె తరుక్కుపోతోంది” అంటూ మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హింస వెనుక పెద్ద కుట్ర ఉందని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను అక్కడికక్కడే ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీసులను ఆమె తీవ్రంగా మందలించారు. “పోలీసులు వెంటనే వెళ్లి ఉంటే ఈ సంఘటనను నివారించవచ్చు” అని పేర్కొంటూ ఆమె పోలీసులపై విరుచుకుపడ్డారు. “డిఐబి (డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో), ఐసి (ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్) తమ బాధ్యతను నెరవేర్చలేదు. తెలిసి కర్తవ్యాన్ని నిర్వర్తించని వారిపై చర్యలు తీసుకోవాలి” అని బెనర్జీ స్పష్టం చేశారు.
కాగా, టిఎంసికి చెందిన రాంపూర్హాట్ 1 బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ షేక్‌ను అరెస్టు చేయాలని ఆమె పోలీసులను అక్కడే ఆదేశించారు. బొగ్తుయ్ కాల్పుల ఘటనకు కుట్ర పన్నారని అనరుల్పై స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటారని ఆమె ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనరుల్‌ను తారాపీఠ్‌లో అరెస్టు చేసినట్లు తర్వాత పోలీస్ అధికారులు తెలిపారు
అలాగే ఫిర్యాదును స్వీకరించడంలో ఆలస్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నిందితులు పారిపోయారు, దొరకడం లేదని కుంటి సాకులు చెప్పొద్దని పోలీసులను ఆమె హెచ్చరించారు. సాక్షులకు అవసరమైన భద్రత కల్పించండని ఆమె ఆదేశించారు.
“మృతుల కుటుంబాలకు రూ 5 లక్షలు చొప్పున, ఇళ్లు పూర్తిగా దగ్ధమైపోయిన వారికి, బాగు చేసుకునే నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఇస్తాం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తాం” అని మమత ప్రకటించారు.
ఆమె అక్కడికక్కడే 10 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున 10 చెక్కులను పంపిణీ చేశారు. గాయపడిన వారికి రూ.50,000, 60 శాతం కాలిన గాయాలు గలవారికి రూ.లక్ష చొప్పున అందజేస్తామని ఆమె ప్రకటించారు.
ఎన్హెచ్ఆర్సీ నోటీసుల జారీ
కాగా, బీర్భూమ్ జిల్లాలో జరిగిన హింసాకాండపై పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ గురువారం నోటీసులు జారీ చేసింది. చిన్నారులతో సహా ఎనిమిది మందిని కాల్చివేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎన్హెచ్ఆర్సి సుమోటోగా స్వీకరించింది.
నాలుగు వారాల్లోగా ఎఫ్ఐఆర్తోపాటు వివరణాత్మక నివేదికలు ఇవ్వాలని కోరింది. గ్రామంలోని ప్రజల భద్రత కోసం తీసుకున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయక చర్యలపై వివరణ ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. ద్వేషపూరిత హింస సంఘటనను కూడా కమిషన్ గమనించిందని, ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు సరిగా లేవని సూచిస్తోందని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది