రాజ్యాంగానికి మూడు స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలోకి మరొకటి చొరబడకూడదని, అప్పుడే వ్యవస్థలన్నవి నడుస్తాయని, అలా కాకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాసనసభ ఫలానా విధానాన్ని, ఫలానా చట్టాన్ని చేస్తుందని ముందస్తుగానే ఊహించుకుని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో ఒక చట్టం రాబోతుందని, దానివల్ల ఫలానా రాజధాని ఫలానా చోట పెడతారు.. అని వాళ్లంతట వాళ్లే ఊహించుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ఎందుకంటే ఈ రోజు అలాంటి చట్టం ఏదీ లేదని, దాన్ని మనం వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ‘ఈ పరిస్థితిలో ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చినట్టు? మూడు రాజధానులను చేస్తూ ఒక చట్టమే లేనప్పుడు ఈ తీర్పు ఎందుకు వచ్చినట్టు?’ అంటూ రాష్ట్ర హైకోర్టు తీరుపట్ల విచారం వ్యక్తం చేశారు.
వికేంద్రీకరణ, రాజధాని అంశంపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని, ఎవరెవరి పరిధి ఏమిటనే విషయాన్ని అందులో చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.
రాజధాని వికేంద్రీకరణపై గౌరవ చట్ట సభకు తీర్మానం చేసే అధికారమూ లేదని కోర్టు తీర్పు ఇవ్వడం శాసన వ్యవస్థలోనికి న్యాయవ్యవస్థ చొరబడడడమేనని జగన్ స్పష్టం చేశారు. దీనిని అవాంఛనీయ ఘటనగా ఆయన పేర్కొన్నారు.
రాజధానితో పాటు ఆ ప్రాంతంలో 3 నెలల్లోపు లక్ష కోట్ల రూపాయల విలువైన కాలువలు, రోడ్లు, నీటి సరఫరా పనులు చేయాలని, ఆరు నెలల్లో రూ.5 లక్షల కోట్ల పనులు చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం అసాధ్యమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
ఇలాంటి తీర్పులు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తి భిన్నమని తెలిపారు.పైగా, హైకోర్టు ప్రస్తావించిన రాజధాని మాస్టర్ ప్లాన్ పూర్తిగా గ్రాఫిక్స్‌లో ఉందని.. పేపర్‌కే పరిమితమై ఉందని జగన్ ధ్వజమెత్తారు.
‘వికేంద్రీకరణే మా విధానం. రాజధాని అంశంలో నిర్ణయాధికారం, బాధ్యత శాసన వ్యవస్థదే. ఈ విషయంలో సర్వాధికారాలతోపాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఈ చట్టసభకు ఉంది’ అని ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించారు.
‘న్యాయ వ్యవస్థ పట్ల తిరుగులేని విశ్వాసం ఉంది. అయితే వికేంద్రీకరణ బాటలో సాగడం మినహా మరో మార్గం లేద’ని సవినయంగా తెలిపారు. వికేంద్రీకరణ విషయంలో ముందుకు వెళ్లడం ద్వారానే అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆత్మగౌరవం ఉందని చెప్పారు.
చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థ పరిధిలో ఉంటుంది. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండదు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రజలు ఐదేళ్లకోసారి ప్రతి ఒక్కరి పనితీరును మధిస్తారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రభుత్వ పాలన, చట్టాలు నచ్చకపోతే ఇంటికి పంపించేస్తారని జగన్ స్పష్టం చేశారు.