పంజాబ్ లో తొలిసారిగా కాంగ్రెస్, అకాలీదళ్ కాకుండా ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకొంటున్నారు. ప్రమాణస్వీకారం రోజుననే అవినీతి ఫిర్యాదులకు ప్రత్యేక ఫోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన, ఇకపై ‘వన్ ఎమ్మెల్యే వన్ పెన్షన్’ విధానం అమలవుతుందని ప్రకటించారు.
ఆ మేరకు ఎమ్మెల్యేల ఫ్యామిలీ పెన్షన్‌లోనూ కోత విధిస్తున్నట్లు వెల్లడించారు. పలువురు ఎమ్మెల్యేలు ఒకసారికి మించి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతుండటంతో పదవీకాలం ముగిసిన ప్రతిసారీ వారికి కొత్తగా మరో పెన్షన్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో ఒక్కొక్కరు రూ.3.50 లక్షల నుంచి రూ.5.25 లక్షలు పెన్షన్ గా అందుకుంటున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాకు భారంగా మారింది.
మాజీ ఎమ్మెల్యేలలో కొందరు ఎంపీలుగానూ కొనసాగుతున్నారు. వారు పార్లమెంట్ సభ్యుడిగా సేవ చేసినందుకు ఆ పెన్షన్ కూడా అందుకుంటున్నారని భగవంత్ మాన్ చెప్పారు. ఈ కారణంగానే ‘వన్ ఎమ్మెల్యే వన్ పెన్షన్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు.
వారు ఇప్పుడు ఒక టర్మ్ పెన్షన్‌కు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఇలా ఆదా అయిన మొత్తాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లులు చేస్తూ లక్షల రూపాయలు పెన్షన్‌గా పొందుతూ ఉంటారని, అయితే వారి కుటుంబాలకు అలవెన్సులు కట్ చేయాలని కూడా నిర్ణయించుకున్నామని సీఎం పేర్కొన్నారు.
“రాజకీయ క్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తామని చేతులు జోడించి నేతలు ఓట్లు అడుగుతారు. కానీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యాక మాత్రం లక్షల రూపాయలు పెన్షన్‌గా అందుకుంటున్నారు. ఇలా తీసుకునే వారిలో చాలా మంది అసెంబ్లీకి కూడా రారు”, అని సీఎం భగవంత్ మాన్ చెప్పారు.
ఇలా ఉండగా, రాష్ట్రంలో నిరుద్యోగం పెద్ద సమస్య ఉందని, యువకులు, యువతులు అందరూ ఉన్నత డిగ్రీలు అభ్యసిస్తారని, ఆ పట్టాల ఆధారంగా ఉద్యోగాలు కోరితే లాఠీచార్జి చేస్తారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు.
ఇందుకోసం పెద్ద ఎత్తున అడుగులు వేస్తున్నామని మాన్ తెలిపారు. 35,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందని మన్ తన తొలి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రూప్ సి, గ్రూప్ డికి చెందిన 35,000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.