‘చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పైవేర్ కొన్నారు’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఏపీలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును దోషిగా తేల్చే ఆధారాలు సేకరించడం కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఛైర్మన్గా హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, కె.భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్, కొఠారు అబ్బయ్యచౌదరి, మేరుగ నాగార్జున, మద్దాలి గిరిధర్ ఉన్నారు.
12 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున స్పీకర్ స్పీకర్ తమ్మినేని సీతారాం సభాసంఘం ఏర్పాటును ప్రకటించి, ఈ అంశంపై నిగ్గు తేల్చే బాధ్యతను సభా సంఘానికి అప్పగించారు. ‘మేం పెగాసస్ కొనలేదు’ అని చంద్రబాబునాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. ‘ఏపీలో పెగాస్సను ఉపయోగించలేదు. ఇది వందశాతం నిజం’ అని అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కూడా తేల్చి చెప్పారు.
ఇక.. వైసీపీ హయాంలోనే డీజీపీగా పని చేసిన గౌతమ్ సవాంగ్, ‘మన రాష్ట్రంలో పెగాసస్ వాడలేదు’ అని అప్పుడెప్పుడో స్పష్టం చేశారు. అయితే మమతా తాజా ప్రకటన ఈ అంశంపై తిరిగి ఏపీ రాజకీయాలలో సరికొత్త రచ్చకు దారితీసింది.
`పెగాసస్ సాఫ్ట్వేర్ను చంద్రబాబు ప్రైవేటుగా కొన్నారు’ అంటూ ఇప్పుడు అధికార పక్షం కొత్త ఆరోపణలు చేస్తోంది. ఇలా ఎవరుపడితే వాళ్లు పెగాసస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేయవచ్చా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఫోన్లపై డిజిటల్ నిఘాపెట్టే అత్యాధునిక సాఫ్ట్వేర్ ఇది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్వో) దీనిని రూపొందించింది.
పెగాస్సను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ… దీనిపై వారి స్థాయిలో నిర్ణయం తీసుకుంటే సరిపోదు. ఈ ప్రతిపాదనను ముందు కేంద్ర హోం శాఖకు పంపించాలి. అక్కడ అంతర్గత భద్రతా విభాగంతోపాటు నిఘా విభాగం నుంచి నివేదిక తెప్పించుకుంటారు. తర్వాత కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలి. అంతా ఒకే అనుకుంటే… కేంద్రం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. అయితే కేంద్రంతో సంబంధం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు.