మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించే విధంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు మహిళా శక్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో మహిళలకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని, క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసే వీరమహిళలకు కమిటీల్లో పెద్దపీట వేస్తామని చెప్పారు.
వీరమహిళ విభాగం ప్రాంతీయ కమిటీలతో శుక్రవారం ఉదయం మనోహర్ -టె-లీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ “గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ 70 నుంచి 80 శాతం మంది మహిళలు వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నారు. శ్రమను ఎక్కువగా ధారపోసేది వ్యవసాయం, వ్యవసాయాధారిత పనుల్లోనే. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా, కష్టాలకోర్చి, కన్నీటిని దిగమింగి కన్నబిడ్డల చదువుల కోసం ఆరుగాలం కష్టపడుతుంటారు. పొదుపు సంఘాల ద్వారా రుణాలు తీసుకొని వాటిని ఠంచనుగా చెల్లించడంలోనూ మన రాష్ట్ర మహిళలదే రికార్డు.” అని నాదెండ్ల వ్యాఖ్యానించారు.
మహిళాభ్యున్నతికి జనసేన పార్టీ వీర మహిళ విభాగం కృషి చేయాలని, ఇందులో భాగంగా గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలను గుర్తించి వారికి అన్ని రకాలుగా సాయపడుతూ స్వశక్తితో నిలబడే విధంగా కృషి చేయాలని మనోహర్ కోరారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్గానిక్ ఫార్మింగ్, పూలు, కూరగాయల పెంపకం, గ్రీన్ హౌస్ ఏర్పాటుచేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఏడాది వారికి రూ. 75 వేల నుంచి లక్ష అదనపు ఆదాయం సమకూరేటట్లు చేయాలని సూచించారు.
జిల్లాకో గ్రామంలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, అవసరమైతే ఆదర్శ రైతుల అనుభవాలు, సైంటిస్టుల సలహాలను కూడా తీసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా బాధ్యతలు తీసుకోవాలని, వారం రోజుల్లో దీనిపై ప్లాన్ రెడీ చేసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా అధ్యక్షుడికి ఒక కమిటీ ఉన్నట్లు ప్రతి జిల్లా మహిళా అధ్యక్షురాలికి కూడా ఒక కమిటీ ఉంటుందని, జిల్లాల మహిళాధ్యక్షులు, మండలాధ్యక్షులను పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని మనోహర్ తెలిపారు.
కష్టపడే మనస్తత్వం, పనితీరు, మండలాల్లో పర్యటిస్తారా? లేదా? పార్టీ కోసం ఎంత వరకు సమయం కేటాయించగలరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసే వీర మహిళలకు ఈ కమిటీల్లో పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. మహిళల పనితీరును బట్టి వారిని కేవలం మహిళా కమిటీలకే పరిమితం చేయకుండా మెయిన్ కమిటీల్లో కూడా స్థానం కల్పిస్తామని తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ నియమాకాలు ఉంటాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.