కొద్దికాలంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో క్షీణిస్తున్న సంబంధాలను మెరుగు పరచుకొనేందుకు గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ చొరవ తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ బిజెపిపై, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై నిప్పులు చేరగడం ప్రారంభించినప్పటి నుండి రాజ్ భవన్ కు దూరంగా ఉంటున్నారు. గవర్నర్ సహితం ఎంతసేపు మోదీ పాలనను పొగడ్తలతో ముంచెత్తడమే గాని రాష్ట్ర పాలన గురించి ఎక్కడా ఒక మంచి మాట కూడా చెప్పక పోవడం టి ఆర్ ఎస్ శ్రేణులకు ఆగ్రహం కలిగిస్తున్నది.
‘సాక్షి’, ‘సాక్షి టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఇటీవల నెలకొన్న విభేదాలు, ఇతర అంశాలపై స్పందిస్తూ తమిళిసై పలు వాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికలు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ నుండి వచ్చి చేరిన కౌశిక్ రెడ్డిని శాసన మండలికి గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం పంపిన ఫైల్ ను ఆ నిబంధనల పరిధిలోకి అతని రాదనీ అంటూ గవర్నర్ ఆమోదించక పోవడంతో కేసీఆర్ కు, ఆమెకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
ఈ పరిణామాలకు పరాకాష్టగా రిపబ్లిక్ దినోత్సవాలను రాజ్ భవన్ కు పరిమితం చేసి, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఎవ్వరు పాల్గొనక పోవడంతో వారి మధ్య విబేధాలు బజారున పడ్డాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో మొదటిసారిగా గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడంతో మరింతగా సంబంధాలు వికటించాయి.
ఈ పరిస్థితులలో రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహింప తలపెట్టిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార, విపక్ష పార్టీల నేతలు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నది. “ఇది నా మర్యాద. నా ఆహ్వానాన్ని అందరూ స్నేహపూర్వకంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నా..” అని పేర్కొనడం ద్వారా కేసీఆర్ తో సయోధ్యకు ప్రయత్నం చేస్తున్నట్లు సంకేతం ఇచ్చారు.
పైగా, ‘ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా పాత విషయాలను మరిచి కొత్త ఆరంభాన్ని మనమందరం ఆకాంక్షిద్దాం’ అంటూ పేర్కొనడం ద్వారా విబేధాలన్నీ ఈ పండుగతో కనుమరుగు కావాలనే బలమైన ఆకాంక్షను సహితం ఆమె వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి చాలా కాలం నుంచి రాజ్‌భవన్‌కు రావడం లేదు. ఈ దూరంకు నా వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవు. నేను ఏ సమస్యనూ సృష్టించాలని కోరుకోను. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటా” అని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
“గవర్నర్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. ముఖ్యమంత్రి అనేవారు ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వ అధినేత. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. నా అధికారాలు, పరిమితులు నాకు బాగా తెలుసు. నేను ఎన్నడూ నా పరిధిని దాటలేదు. గణతంత్ర దినోత్సవ నిర్వహణ (వివాదం), అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం వంటి ఉదంతాలు ప్రజల ముందు ఉన్నాయి. నేను ఎవరికీ తలొగ్గను. అత్యంత బలమైన వ్యక్తిని” అని చెప్పడం ద్వారా సయోధ్యకోసం తాను చేస్తున్న ప్రయత్నాలకు స్పందించడాన్ని కేసీఆర్ కు వదిలివేస్తున్నట్లు ఆమె సంకేతం ఇచ్చారు.