రాష్ట్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్లను దుర్వినియోగం చేసిందని చెప్పిన కాగ్ నివేదికపై సిబిఐతో విచారణ జరిపించాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ నిధుల దుర్వినియోగంపై కాగ్ పలుమార్లు ప్రశిుంచినా ప్రభుత్వం నుంచి సమాధానం లేదని వెల్లడించారు.
ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందనేది చెప్పాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానిదేనని అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అందులో రూ.48 వేల కోట్లకుపైగా సొమ్ము దుర్వినియోగం అయిందని మాజీ ఆర్ధిక మంత్రి తెలిపారు.
దాణా కుంభకోణం రూ.66 కోట్లను బయటపెట్టింది కాగ్ అని, దీనిపై కేంద్రం సిబిఐ విచారణ ఆదేశించిందని యనమల ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ బిల్స్ జిఓను సరిదిద్దుకున్నారని, ఇలా ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. పిఎసి సమావేశానికి ప్రతిపక్షాన్ని పిలవకుండా, కాగ్‌కు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం దొడ్డిదారిలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
బడ్జెట్ పరిధిలోని అప్పులు కాకుండా హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌ను ఎలా ఖర్చు పెడుతున్నారో ప్రభుత్వం చెప్పడం లేదని 15వ ఆర్థిక సంఘం గతంలోనే పేర్కొందని యనమల గుర్తు చేశారు. 2024 చివరికి రాష్ట్ర అప్పులు రూ.8 లక్షల కోట్ల నుంచి రూ.9 లక్షల కోట్ల వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను కాపాడాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అమరావతిపై హైకోర్టు తీర్పును చదవకుండా నిబంధనలకు విరుద్ధంగా చట్టసభలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని టిడిపి నేత విమర్శించారు.