జాతీయ భావనకు వ్యతిరేకంగా ఉన్న వాదనలన్నీ క్రమంగా నీరుగారి, తమ అస్తిత్వం కోల్పోతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారక్ గా పనిచేసి, వేలాదిమంది సామజిక కార్యకర్తలకు మార్గదర్శిగా నిలచిన సోమేపల్లి సోమయ్య గురించి నవయుగ భారతి ప్రచురించిన `స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య’ గ్రంధాన్ని ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ఆవిష్కరిస్తూ పితృవాత్సల్యంతో తన ఎదుగుదలకు మార్గనిర్దేశం చేసిన సోమేపల్లి సోమయ్య జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం, ఆ పుస్తకాన్ని తాము స్వయంగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.
దివిసీమ సమయంలో పుననిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంలో సోమయ్య అసాధారణమైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారని ఆయన గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎందరో యువకులు సామజిక సేవలో నిమగ్నం కావడానికి స్ఫూర్తి కలిగించారని చెప్పారు.
ప్రజల సాంఘిక జీవనం ఆందోళనలో పడ్డ ప్రతి సందర్భంలోనూ వారు ముందుకు వచ్చారన్న ఆయన, ప్రకృతి బీభత్సాలు జరిగిన సమయంలో సత్వర సహాయం, శాశ్వత ప్రయోజనం అనే ప్రాతిపదికతో ప్రణాళికలు వేసే వారని తెలిపారు.
జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత సోమేపల్లి సోమయ్య,బోగాది దుర్గాప్రసాద్ లకు తాను రుణపడి ఉంటాని ఆయన చెప్పారు. తాను జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలనని విశ్వసించి, యువకునిగా తనను ప్రోత్సహించి ముందుకు నడిపింది వారేనని తెలిపారు. అటువంటి వారి జీవన తపస్సు కారణంగానే సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకువెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమౌతున్నాయని వెంకయ్య నాయుడు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వాదనలు పుట్టినప్పటికీ సానుకూల మార్పును కోరుకొనే జాతీయవాద భావనే అంతిమంగా విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నాటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతాల మూలాలతో పుట్టిన అనేక సిద్ధాంతాలు జాతీయవాద భావనను విస్మరించిన కారణంగా మెల్లి మెల్లిగా తమ ప్రభను కోల్పోతున్నాయని తెలిపారు.
శతాబ్ధాలుగా భారతదేశాన్ని మందుకు నడిపిస్తున్న వసుధైవ కుటుంబ భావనను యువత కాపాడుకోవాలని దిశానిర్దేశం చేసిన ఉపరాష్ట్రపతి, భారతదేశ అభివృద్ధికి పాటుపడిన మహనీయుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది, సమసమాజ స్థాపనకు అవరోధాలుగా నిలుస్తున్న పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, సాంఘిక వివక్షల వంటి దురాచారాలను పారద్రోలేందుకు యువత నడుం బిగించాలని ఆకాంక్షించారు.
ఎందరో మహనీయుల జీవితాలను లాభాపేక్ష రహితంగా అతి తక్కువ మూల్యంతో నవయుగ భారతి పుస్తకాలుగా అందుబాటులోకి తెస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సభ్యుడు భాగయ్య, నవయుగభారతి అధ్యక్షుడు బాలేంద్ర పొట్టూరి, తెలంగాణ ప్రాంత ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ బూర్ల దక్షిణామూర్తి, పుస్తక రచయిత కె. శ్యామ్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.