మరోసారి ఆద్యంతం నిలకడగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాది తన ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ చాంపియన్‌గా అవతరించింది.
గత ఏడాది కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన 26 ఏళ్ల సింధు ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి తొలిసారి స్విస్ ఓపెన్ విజేతగా నిలిచింది. ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–16, 21–8తో గెలిచింది.
అంతర్జాతీయ టోర్నీలలో బుసానన్‌పై సింధుకిది 16వ విజయం కావడం విశేషం. 49 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. అయితే స్కోరు 16–15 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిచి 18–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్‌ను బుసానన్కు కోల్పోయిన సింధు ఆ వెంటనే వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లో సింధు ఆరంభం నుంచే చెలరేగిపోగా బుసానన్ డీలా పడిపోయింది. స్కోరు 12–4 వద్ద సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 20–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బుసానన్కు వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకున్నాక సింధు ఒక పాయింట్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
విజేతగా నిలిచిన సింధుకు 13,500 డాలర్ల (రూ. 10 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సింధుకిది రెండో టైటిల్. గత జనవరిలో ఆమె సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్, 2016 చాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ రన్నరప్‌గా నిలిచాడు. కేరళకు చెందిన ప్రణయ్ ఫైనల్లో 12–21, 18–21తో 2018 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.
ప్రధాని మోదీ, సీఎం జగన్ అభినందన
స్విస్ ఓపెన్ విజేత సింధును ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ‘స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తెలుగు షట్లర్, దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి సింధుకు శుభాకాంక్షలు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి. సింధు ప్రతి ప్రయత్నానికి దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
‘సింధు విజయాలు దేశ యువతకు ప్రేరణ ఇస్తాయి. భవిష్యత్‌లో ఆమె మరిన్ని టోర్నీలలో రాణించాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.