పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం అధికార టిఎంసి, ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. భీర్భూంలో చోటుచేసుకున్న హత్యలపై చర్చించాలని పట్టుబడ్డ బిజెపి.. రాష్ట్రంలో శాంతి, భద్రతలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వీడాలంటూ డిమాండ్ చేయడంతో అధికార తఅణమూల్ కాంగ్రెస్, బిజెపి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది.
ఇది కాస్త మాటల యుద్ధం నుండి చేతల దాడి వరకు దారి తీసింది. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారు. కాగా, ఈ ఘర్షణలకు కారణమైన ప్రతిపక్ష శాసన సభా పక్షనేత సువేందు అధికారితో పాటు మరో నలుగురు బిజెపి ఎమ్మెల్యేలను సంవత్సరం పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఇటీవల బీర్భూం జిల్లాలోని రామ్‌పుర్‌హట్‌లో చోటుచేసుకున్న ఘటనలో హింసాత్మక ఘటనలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతో సహా 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. టిఎంసి నేత హత్య తర్వాత ఈ మారణకాండ చోటుచేసుకుంది. ఈ ఘటననున సుమోటోగా స్వీకరించిన కోల్‌కతా హైకోర్టు.. దర్యాప్తు నిమిత్తం సిబిఐకి అప్పగించింది.
ఈ ఘటనకు కారకులైన 22 మందిని నిందితులుగా సిబిఐ చేర్చింది. అయితే ఈ ఘటనపై శాసనసభలో చర్చించాలని, శాంతి, భద్రతలపై మమత సమాధానం చెప్పాలంటూ బిజెపి పట్టుబట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇరు పక్షాల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ బాహాబాహీకి దిగారు.
మార్షల్స్, పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ… వారంతా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడుతూనే ఉన్నారు. అనంతరం బిజెపి ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను ఇరు పార్టీల నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనలో తృణమూల్ ఎమ్మెల్యే ఆశిత్ మజుందర్‌కు ముక్కుకు గాయం కాగా, ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తనపై బిజెపి నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి దాడి చేశారంటూ తెలిపారు.
దేశంలో శాంతి, భద్రతలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే.. సివిల్ డ్రస్‌లో వచ్చిన కోల్‌కతా పోలీసులు తమ ఎమ్మెల్యేలతో గొడవకు దిగారంటూ సువేందు మీడియాతో ఆరోపించారు.
అసెంబ్లీలోఎమ్మెల్యేలకు రక్షణ కొరవడిందని, చీఫ్ విప్ మనోజ్ తిగ్గాతో సహా సుమారు 8-10 మంది ఎమ్మెల్యేలపై టిఎంసి సభ్యులు దాడి చేశారని తెలిపారు. కాగా తృణమూల్ నేత, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ.. బిజెపి ఎమ్మెల్యేల దాడిలో తమ ఎమ్మెల్యేల గాయపడ్డారని, బిజెపి నేతల చర్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.