యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనలో ప్రధాన ఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణను వేద మంత్రాల మధ్య వైభవంగా జరిపిన తర్వాత స్వయంభూ దర్శనాలు తిరిగి సోమవారం మొదలయ్యాయి. ఉదయం ఆలయ మహాకుంభసంప్రోక్షణలో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు. ఇక నిర్మాణంలో భాగస్వాములైన వారిని సన్మానించారు. ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ పూర్తయ్యింది.
ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం వేదమంత్రోచ్చారణల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్నంలో.. పుష్కరాంశ శుభ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ జరిగింది.
తొలుత గర్భాలయంపై ఉన్న విమానగోపురం వద్ద పూజలు చేసి, ఆశీర్వచనం నిర్వహించారు. కేసీఆర్కు కంకణధారణ చేసి, సుదర్శన చక్రానికి పూజలు చేయించారు. అనంతరం దివ్య విమాన రాజగోపురం వద్ద ఉదయం 11:55 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త మిథునలగ్న అభిజిత్ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభించారు.
ప్రధానాచార్యులు నల్లంథీఘల్ లక్ష్మీనర్సింహాచార్యుల ఆధ్వర్యంలో సువర్ణ సుదర్శన చక్రానికి బంగారు కలశంలో నింపిన పవిత్ర నదీజలాలతో మహాకుంభాభిషేకం (సంప్రోక్షణ) నిర్వహించారు. ఇదే సమయంలో మిగతా గోపురాల వద్ద మంత్రులు కుంభ సంప్రోక్షణ చేశారు. చివరిగా సుదర్శన చక్రం చుట్టూ ప్రదక్షిణలు, హారతి నివేదన పూర్తి చేశారు.
పంచనారసింహుడు కొలువైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. 7 రోజులు కొనసాగిన సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలకు ఆచార్యులు 8వ రోజు సోమవారం రాత్రి ముగింపు పలికారు.
మహాకుంభ సంప్రోక్షణ తర్వాత ప్రధానాలయంలో శాంతి కల్యాణం జరిపించారు. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, రంగాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మూడుసార్లు స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు.
ఇక చాలాకాలం తర్వాత స్వయంభూ దర్శనాలకు అనుమతించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం నుంచి ఆలయంలో రద్దీ భారీగా కనిపించింది. స్వామివారి దర్శనంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం చాలా బాగుందని అంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
యాదాద్రి లక్ష్మీ నర్సింహుడికి సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజ చేశారు. ప్రధానాలయం చుట్టూ నిర్వహించే స్వామివారి శోభయాత్రలో పాల్గొన్నారు. తర్వాత ప్రధానాలయ విమాన గోపురం దగ్గర మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్నారాయన. గంటకుపైగా గోపురంపైన పూజల్లో పాల్గొన్నారు. 126 మెట్లు ఎక్కి గోపురంపైకి వెళ్లిన సీఎం.. మళ్లీ అదే మార్గంలో కిందకు వచ్చారు.
ఆలయం పున:ప్రారంభం కావడంతో సాయంత్రం 3 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. దర్శనాలపై ముందే ప్రకటన చేయడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆలయం అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు భారీగా రావడంతో దర్శనాలు ఆలస్యమయ్యాయి.