సమతామూర్తి విగ్రవిష్కరణ కార్యక్రమంకు ముందుకూడా అక్కడకు వెళ్లి, అక్కడ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కార్యక్రమాలలో ఎక్కడా పాల్గొనకపోవడంతో మొదటిసారిగా బహిర్గతమైన చిన్నజియ్యర్ స్వామితో ఆయనకు ఏర్పడిన విబేధాలు, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అన్నీ తానై వ్యవహరించిన చినజీయర్ లేకుండానే సీఎం కేసీఆర్ ఆలయాన్ని ప్రారంభించడంతో మరోసారి వెల్లడయ్యాయి.
చినజీయర్ నిర్ణయించిన ముహూర్తానికే వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ చేసినా, ఆయనకు కనీసం ఆహ్వానం కూడా పంపకపోవడం గమనార్హం. “తాము ఎవరికి దూరం కావాలనుకోనని, ఎవరైనా కావాలనుకొంటే తాము చేసేదేమీ లేదని” అంటూ తమ మధ్య ఏర్పడిన అగాధాన్ని చిన్నజియ్యర్ స్వయంగా ఈ మధ్య విజయవాడలో మీడియా సమావేశంలో వెల్లడించారు.
అయితే ఆ తర్వాత “చిన్నజియ్యర్ కు నాకు దూరం పెరిగినది మీకు ఎవ్వరు చెప్పారు? మీకెలా తెలిసింది” అంటూ పుకార్లే” అంటూ స్వయంగా కేసీఆర్ మరో మీడియా సమావేశంలో కొట్టిపారవేసారు. దానితో యాదాద్రికి స్వామీజీని ఆహ్వానించవచ్చని, ఆ విధంగా వారిద్దరూ తిరిగి కలుసుకోగలరని చాలామంది భావించారు. అయితే ఆయన ప్రసక్తి లేకుండా యాదాద్రిలో కార్యక్రమాలు జరిగాయి.
ఆలయ పునః ప్రారంభానికి మాత్రం జీయర్ను మాత్రమే కాదు, గత ఏడాది కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆహ్వానించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా లేకుండానే కార్యక్రమాలు జరిగిపోయాయి. కనీసం రాష్త్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కూడా ఈ ఉత్సవానికి ప్రభుత్వం ఆహ్వానించలేదు.
మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులు మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఇతర పార్టీలకు చెందిన ఆ ప్రాంత ప్రజాప్రతినిధులను సహితం ఎవ్వరిని ఆహ్వానించలేదు.
గతంలో ప్రధానిని ఆహ్వాయించి, ఇప్పుడు ఆయన లేకుండా కార్యక్రమం జరిపితే ఇబ్బంది అనుకున్నారో, ఏమో అసలు ఆహ్వానం అంటూ లేకుండా, ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం వలే జరిపించి వేశారు. అయితే అందరు అధికార పార్టీ నేతలో పాల్గొనడంతో అదొక్క అధికార పక్షం కార్యక్రమం మాదిరిగా జరిగింది.
తెలంగాణ ఆవిర్భావం నుంచి కేసీఆర్, చినజీయర్ మధ్య సాన్నిహిత్యం నెలకొంది జీయర్ భక్తుడిగా చెప్పుకునేందుకు కేసీఆర్ ఏమాత్రం సందేహించేవారు కాదు. సీఎం హోదాలో పలుమార్లు ముచ్చింతల్‌లోని జీయర్ ఆశ్రమాన్ని సందర్శించుకొని, ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఇంటిల్లిపాదిని తీసుకెళ్లి జీయర్ ఆశీర్వచనం అందుకునేవారు.
కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ చినజీయర్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కొండపోచమ్మసాగర్ ప్రారంభానికి జీయరే ముఖ్య అతిధి. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ ప్రారంభోత్సవంలోనూ జీయర్ ప్రధాన ఆకర్షణ. ఓసారి సీఎం కూర్చీలో జీయర్ను కేసీఆర్ కూర్చోబెట్టారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో చిన జీయర్దే కీలకపాత్ర. ఆలయ నిర్మాణానికి అంకుర్పారణ మొదలు మహాకుంభ సంప్రోక్షణ వరకు అన్నీ ఆయన పర్యవేక్షణలోనే చేశారు. పలుమార్లు ప్రత్యేక హెలికాప్టర్లో జీయర్ను కేసీఆర్ వెంటబెట్టుకొని నిర్మాణ పనులను పరిశీలించారు.
జీయర్ సూచనలతో పలు మార్పులుచేశారు. యాదాద్రికి సంబంధించిన ఏ పని చేయాలన్నా జీయర్ సూచన తప్పనిసరిగా పెట్టుకున్నారు. నిరుడు డిసెంబర్లో కేసీఆర్ ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లి జీయర్తోనే ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించారు.
అయితే ఇటీవల ముచ్చింతల్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహావిష్కరణ నుంచి సీఎం కేసీఆర్, చినజీయర్‌కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. విగ్రహావిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు వీవీఐపీలు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.
అప్పటివరకు ఏర్పాట్లు చేయటంతోపాటు ఉత్సవాలపై అధికారులతో సమీక్షించిన కేసీఆర్ ప్రధాని మోదీ వచ్చినప్పటి నుంచి చినజీయర్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రధానితో పాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా ఎవరు వచ్చినా కేసీఆర్ ముచ్చింతల్ వైపు కన్నెత్తి చూడలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా కేసీఆర్ తమకు ఎంతో తోడ్పాటు అందించినట్లు చినజీయర్ చెప్పినా ఫలితం లేకపోయింది.