రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోని అధికార బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తుతూ దీనిపై ఉమ్మడి కార్యాచరణకు ఓ భేటీకి హాజరు కావాలని సూచిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ బిజెపియేతర ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష పార్టీలకు లేఖ వ్రాసారు.
ఈ లేఖలో విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఆమె కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లే మార్గం గురించి చర్చించడానికి కలిసొచ్చేవారంతా సమావేశమవ్వాలని మమత పిలుపునిచ్చారు. బీజేపీ అణచివేత పాలనపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె స్పష్టం చేశారు.
ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు బిజెపి సర్కార్ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారని మమతా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ఎక్కడైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రం.. దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగపరుస్తుందని ఆమె విమర్శించారు. దీనిపై మనందరం కలిసి చర్చించాలని ప్రతిపక్షాలకు ఆమె పిలుపునిచ్చారు.
బొగ్గు గనుల స్కాం కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ మమతా మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేయగా మరింత సమయం కావాలని కోరిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ అణచివేత శక్తికి వ్యతిరేకంగా దేశంలో అన్ని ప్రగతిశీల శక్తులు ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని దీదీ పేర్కొన్నారు.
దేశానికి అర్హమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏకీకృత, సూత్రప్రాయ ప్రతిపక్షం కావాలని కోరుతూ ఆమె లేఖ రాశారు. ‘ఇడి, సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి), ఆదాయపు పన్ను శాఖ వంటి దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగపరుస్తూ.. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని… వేధింపులకు గురి చేస్తోంది’ అని మండిపడ్డారు.
కేంద్రం వైఖరిని మనమంతా ప్రతిఘటించాలని ఆమెకే కోరారు. పార్లమెంట్లో విపక్షాలు వాకౌట్ చేసిన తర్వాత .. ఇడి, సిబిఐ చీఫ్‌ల పదవీకాలాన్ని పొడిగించేలా చట్టాలు చేసుకుందని ఆమె విమర్శించారు. న్యాయ వ్యవస్థ పట్ల తనకెంతో గౌరవముందని అంటూనే కొన్ని పక్షపాత రాజకీయ జోక్యాల వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని, ఇది ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన ధోరణి అని మమతా హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ, మీడియా, ప్రజలు మూల స్థంభాలని, ఏదైనా విభాగానికి అంతరాయం కలిగితే..వ్యవస్థ కూలిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.