నెలరోజులకు పైగా భీకరంగా జరుగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లకు రెండు దేశాల శాంతి చర్చల్లో పురోగతి వచ్చింది. కీవ్, చెర్నిహివ్ నుంచి బలగాలు ఉపసంహరించేందుకు రష్యా అంగీకరించింది. కీవ్, చెర్నిహివ్ చుట్టూ మోహరించిన బలగాలను వెనక్కి పిలిపిస్తామని రష్యా రక్షణశాఖ మంత్రి అలెగ్జాండర్ ఫొమిన్ చెప్పారు. జెనీవా ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని ఉక్రెయిన్ చెప్పిందని పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య టర్కీలో మంగళవారం జరిగిన శాంతి చర్చల్లో తటస్థంగా ఉంటామని ఉక్రెయిన్ లిఖిత పూర్వక హామీ ఇచ్చిన నేపథ్యంలో రష్యా తన మిలిటరీ కార్యకలాపాలను తగ్గిస్తామని రష్యా చెప్పింది. ఈ నాటకీయ పరిణామాలు ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఏర్పరిచాయి.
టర్కీ మధ్యవర్తిత్వంలో జరిగిన ఈ శాంతి చర్చలు ప్రయోజనకరంగా ఉన్నట్లు రష్యా ప్రతినిధి బృంద నేత వ్లాదిమిర్ మెదిన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్ తటస్థత, అణ్వస్త్రరహిత దేశంగా ఉండేందుకు అంగీకరించడంతో చర్చలు ఆచరణాత్మక దశకు చేరాయని రష్యా డిప్యూటీ రక్షణమంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ వ్యాఖ్యానించారు. కీవ్, చెర్నిగోవ్ సమీప ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు చాలా వరకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అయితే ఈ సమస్యకు పూర్తిగా పరిష్యారం దొరికే వరకు కాల్పుల విరమణ ఉండబోదని అందుకోసం మరింత చర్చించాలని రష్యా ప్రతినిధి తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కోసం తాము మరింత దూరం ప్రయాణించాలని ఆయన చెప్పారు. దీంతో రష్యా బలగాల దాడులు ఉక్రెయిన్‌లో కొనసాగుతూ ఉన్నాయి.
అయితే ఈ సమస్యకు పూర్తిగా పరిష్యారం దొరికే వరకు కాల్పుల విరమణ ఉండబోదని అందుకోసం మరింత చర్చించాలని ఆయన తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కోసం తాము మరింత దూరం ప్రయాణించాలని ఆయన చెప్పారు. దీంతో రష్యా బలగాల దాడులు ఉక్రెయిన్‌లో కొనసాగుతూ ఉన్నాయి.
ఇక.. సమస్య పూర్తిగా సమసిపోయే వరకు రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉంటాయని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ తెలిపారు. త్వరలోను పుతిన్, జెలెన్ స్కీ భేటీ కూడా జరుగుతోందని కూడా వెల్లడించారు.
తెల్లవారుజామున ఇస్తాంబుల్ చేరుకున్న ఇరుదేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా దీనికి హాజరయ్యారు. తమ ప్రాథమిక లక్ష్యాలను ఈ చర్చల ద్వారా సాధిస్తామని రష్యా విదేశాంగమంత్రి సెర్గె లవ్రోవ్ వెల్లడించారు. యుద్ధం మొదలైన తర్వాత ఇరువర్గాల మధ్య బెలారస్, పొలాండ్ సరిహద్దుల్లో మూడు దఫాలు చర్చలు జరిగాయి. అయితే శాంతి దిశగా ఎలాంటి ముందడుగూ పడలేదు.
ఇలా ఉండగా, ఉక్రెయిన్ భద్రతకు తమకు అంతర్జాతీయ ఒప్పందం కావాలని ఉక్రెయిన్ ప్రతినిధి బృందం కోరింది. ఈ ఒప్పందం కింద ఇతర దేశాలు ఉక్రెయిన్ భద్రతకు పూచీ పడాలని పేర్కొంటోంది. ”అంతర్జాతీయ యంత్రాంగంతో కూడిన భద్రతాపరమైన హామీలు మాకు కావాలి. నాటో నిబంధనావళిలోని ఐదవ అధికరణ తరహాలోను, అంతకన్నా మరింత ధృఢంగా మాకు హామీ ఇవ్వాలి” అని ఉక్రెయిన్ ప్రతినిధి బృంద సభ్యుడు డేవిడ్ అర్కామియా తెలిపారు.
రష్యా ప్రతినిధి బృందంతో చర్చలనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బ్రిటన్, చైనా, అమెరికా, టర్కీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, పోలండ్, ఇజ్రాయిల్ దేశాలు అటువంటి హామీలు ఇవ్వాలని కోరారు. వీటిల్లో కొన్ని దేశాలు ఇప్పటికే ప్రాథమిక అంగీకారాన్ని తెలిపాయన్నారు. రష్యా కూడా ఒక హామీదారుగా వుండాలని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌పై 35 రోజులుగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తూ పలు సిటీలను స్వాధీనం చేసుకున్నా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను మాత్రం కైవసం చేసుకోలేకపోతోంది. రష్యన్ సేనల భీకర దాడులను ఉక్రెయిన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతూ.. రాజధానిని కాపాడుకుంటోంది. అయితే ఓ వైపు యుద్ధం సాగిస్తూన్నా మరోవైపుశాంతి ప్రయత్నాలనూ ఆపడంలేదు
ఈ చర్చల కోసం ఓ వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాము న్యూట్రల్ గా ఉండేందుకు సిద్ధమని, నాటో సభ్యత్వం కోరబోమని చెబుతున్నా.. రష్యాకు ఆమోదయోగ్యం కాని కొన్ని షరతులనూ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధం ఆపడానికి తన షరతులను చెబుతూ పంపిన లేఖపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించినట్లు పశ్చిమ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జెలెన్స్కీని వదలబోనని ఆ లేఖ తీసుకెళ్లిన శాంతి దూతతో చెప్పినట్లుగా తెలుస్తోంది.
యుద్ధాన్ని ఆపాలని, శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలని జెలెన్ స్కీ పంపిన విజ్ఞప్తికి పుతిన్ ఘాటుగా స్పందించారు. యుద్ధాన్ని ముగించడానికి తన షరతులను తెలుపుతూ జెలెన్ స్కీ స్వయంగా ఓ నోట్ రాసి పుతిన్ కు పంపారు. రష్యాకు చెందిన ఓ శాంతిదూత ద్వారా ఈ లేఖను పుతిన్ దగ్గరకు చేర్చారు. ఈ సందర్భంగా పుతిన్ స్పందిస్తూ.. జెలెన్ స్కీని వదలబోనని, ఉక్రెయిన్ ను అణచివేస్తానని ఘాటుగా బదులిచ్చారని తెలుస్తోంది.
ఉక్రెయిన్ న్యూట్రల్‌గా ఉండాలన్న రష్యా డిమాండ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని జెలెన్స్కీ వెల్లడించారు. ఎటువంటి ఆలస్యం జరగకుండా చర్చలు కొనసాగాలని, ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. మరోవైపు ఉక్రెయిన్ ను మొత్తంగా తమ నియంత్రణలోకి తీసుకోవడంలో విఫలం కావడంతో తమ అధీనంలోకి వచ్చిన ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
చనిపోయిన తమ సొంత సైనికులను కూడా రష్యా పట్టించుకోకపోవడం దారుణమని జెలెన్స్కీ మండిపడ్డారు. ‘‘తమ సొంత మనుషులను రష్యా ఎలా చూస్తోందనేది చాలా కీలకం. రష్యా తీరు చూస్తుంటే చాలా భయమేస్తుంది. సొంత వారినే అలా చూస్తుంటే మిగతా వారిని ఏం పట్టించుకుంటారు? ఇది చాలా క్రూరమైనది, దీని ముగింపు చాలా దారుణంగా ఉంటుంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని అక్కడే వదిలి పెట్టడమో లేదంటే చెత్త కుప్పల్లో పడేయడమో చేస్తున్నారని చెప్పారు.
సైనికుల శవాలను అలా వదిలేస్తుంటే వారి కుటుంబ సభ్యులు ఎలా అంగీకరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘‘మా దేశంలో మేం ఎందుకు పోరాడుతున్నామో మాకు తెలుసు. కానీ, మీ సంగతేంటి? మీ దేశంలో ఏం జరుగుతోంది? అది నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా విషాదకరం. అది మమ్మల్ని దారుణంగా దెబ్బతీస్తోంది” అని తెలిపారు. కాగా, తమ మేయర్లను రష్యన్లు కిడ్నాప్ చేస్తున్నారని, ఇప్పటికే కొందరిని చంపేశారని జెలెన్స్కీ ఆరోపించారు.