పెట్రోల్, డీజిల్, ఆహార వస్తువులు, ఒకటేమిటీ… దైనందిన జీవితంలో వాడే ప్రతీదానిపై ఛార్జీల బాదుడు పెరిగి సామాన్యులు కుదేలవుతున్నారు. ప్రతీరోజూ సామాన్యులపై అదనపు భారాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా.. వాహనదారులపై మరో భారం పడనుంది.
జాతీయ రహదారులపై టోల్ ప్లాజ్ల రేట్లు కూడా పెరిగాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి టోల్ ఫీజులు పెరగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫీజులు శుక్రవారం అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి పెరగనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఖరారు చేస్తూ ఆదేశాలు వచ్చాయి.
ఏయే వాహనాలకు..
కార్లు, జీపులు వంటి వాహనాలపై రూ.5-10,
బస్సులు, లారీలకు రూ.15-25,
భారీ వాహనాలకు రూ.40-50 వరకు పెరగనున్నాయి.
సింగిల్, డబుల్ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ రేట్ల పెంపు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై కలిపి మొత్తంగా 57 టోల్ ప్లాజాలున్నాయి. వీటి మీదుగా వెళ్లే వాహనాల ద్వారా ప్రస్తుతం రోజుకు సగటున రూ.6.6 కోట్ల వరకు టోల్ వసూలవుతోంది. అంటే ఏడాదికి రూ.2,409 కోట్ల వరకు వస్తోంది.