ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం గత వారం 40 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్వొ) వెల్లడించింది. అమెరికాలో తాజా మరణాలతో పాటు భారత్లో సవరించిన గణాంకాల ప్రకారం ఈ పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం విడుదల చేసిన నివేదిక వివరించింది.
డిసెంబర్ నుంచి కరోనా కేసులు పెరుగుతున్న పశ్చిమ పసిఫిక్ రీజియన్తోపాటు ప్రతిచోటా తాజా కరోనా కేసుల సంఖ్య తగ్గిందని వారం వారీ నివేదిక పేర్కొంది. గత వారం దాదాపు 10 మిలియన్ తాజా కేసులు, 45,000 కు పైగా మరణాలు నమోదయ్యాయని, అంతకు ముందు వారం మరణాల్లో 23 శాతం తగ్గుదల కనిపించిందని వివరించింది.
అంతకు ముందటి వారంలో మరణాలు 33,000 నుంచి మరణాల సంఖ్య సవరించిన గణాంకాల వల్ల పెరిగిందని, మరణాల సంఖ్య నమోదు విషయంలో చిలీ, అమెరికా దేశాలతోపాటు అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయని డబ్లుహెచ్వొ పేర్కొంది.
భారత్లో కరోనా మరణాలకు సంబంధించి మొదట్లో మహారాష్ట్ర నుంచి మరణాలు కలపలేదని, తరువాత 40,000 కు పైగా మరణాలు కలిపి మరణాల మొత్తం సంఖ్య సవరించారని వివరించింది.
ఇలా ఉండగా, భారత దేశంలో దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా 6.24 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1233 మందికి వైరస్ సోకినట్టు తేలింది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు రెండు వేల దిగువకు , పాజిటివిటీ రేటు ఒకశాతం లోపునే నమోదవుతున్నాయి.
24 గంటల వ్యవధిలో 31 మంది మరణించారు. మంగళవారం 1876 మంది కోలుకోగా, రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది. తాజాగా క్రియాశీల కేసులు ఇంకాస్త తగ్గి , 15 వేల దిగువకు చేరాయి. దాంతో క్రియాశీల రేటు 0.03 శాతానికి క్షీణించింది.
ఇప్పటివరకు దేశంలో 4.30 కోట్ల కరోనా కేసులు రాగా, 5.21 లక్షల మంది మరణించారు. ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్రం మొదలు పెట్టిన టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. దాని కింద 183 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. మంగళవారం 26.34 లక్షల మంది టీకా తీసుకున్నారు.
భారత్లో ప్రతి పది లక్షల జనాభాకు 374 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికా బ్రెజిల్ , రష్యా, మెక్సికో దేశాలతో పోలిస్తే కరోనా మరణాల రేటు భారత్ లోనే తక్కువని పేర్కొంది. కొవిడ్ మరణాలు అధికంగా ఉన్నాయంటూ వస్తోన్న వార్తలపై రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.
“ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి పది లక్షల మందికి (374 మరణాలు) అతి తక్కువ కరోనా మరణాలు చోటు చేసుకున్న దేశాల్లో భారత్ ఒకటి. అమెరికాలో ప్రతి పది లక్షల మందికి 2920 మరణాలు చోటు చేసుకోగా, బ్రెజిల్లో 3092, రష్యాలో 2506.మెక్సికోలో 2498,మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆయా దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా మరణాల రేటు చాలా తక్కువ” అని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వివరించారు.