ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండ కేసుపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు నియమిత కమిటీ సిఫారసు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు శరాఘాతంగా మారింది. ఆయన కుమారుడు, ఈ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిలును రద్దు చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసినట్లు సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.
ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దుపై స్పందించాలంటూ యుపి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజరు మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ మాజీ జడ్జి రాకేష్ కుమార్ జైన్ నేతృత్వంలోని కమిటీ యుపి ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కొహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. దీనిపై యుపి ప్రభుత్వ స్పందన కోరుతూ.. ఏప్రిల్ 4వ తేదీని గడువుగా విధించింది. ఆశిష్ మిశ్రాకి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ.. బాధితుల కుటుంబసభ్యులు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ మహేశ్ జెఠ్మలానీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి ఈ లేఖలు చేరలేదని చెప్పారు. ఈ లేఖలు తనకు చేరలేదని అదనపు ప్రధాన కార్యదర్శి చెప్పారని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు స్పందిస్తూ, సిట్ నివేదికలను పరిశీలించాలని, ఏప్రిల్ 4నాటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పారు.
ఇదిలావుండగా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం స్పందిస్తూ, బెయిలును సమర్థవంతంగా వ్యతిరేకించలేదనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఆశిష్ మిశ్రాకు బెయిలు మంజూరు చేయరాదని నిర్ద్వంద్వంగా చెప్పినట్లు తెలిపింది. ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిలును సవాల్ చేసే విషయాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపింది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యుపిలోని లఖింపూర్ ఖేరిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను ఆశిష్ మిశ్రా కారుతో తొక్కించిన ఘటన దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అనంతరం నాటకీయ పరిణామాల నడుమ అశిశ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో 2022, ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ.. బాధితుల కుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిందితుడు అశిష్ మిశ్రాకు ‘బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ’ యుపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు సైతం జారీ చేసింది.