సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం(అఫ్స్పా) పరిధి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోని 36 జిల్లాలను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. అస్సాంలో 23, మణిపూర్‌లో 6, నాగాలాండ్‌లో 7 జిల్లాలకు ఈ మినహాయింపు లభించింది. అఫ్స్పా 1958 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చింది. ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటం కోసం ఈ చట్టాన్ని తెచ్చారు.
ఈ చట్టం ప్రకారం అవసరమనుకుంటే చర్యలను చేపట్టేందుకు సాయుధ దళాలు అమలు చేయడానికి ఈ చట్టం అనుమతి ఇస్తుంది. తీవ్రవాదుల శిక్షణ స్థావరాలను ధ్వంసం చేయడం, వారెంట్ లేకుండా వ్యక్తులను అరెస్టు చేయడం వంటి వాటికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.
గత ఏడాది డిసెంబరు 4న నాగాలాండ్‌లోని మోన్ జిల్లా, ఓటింగ్ గ్రామస్థులను ఉగ్రవాదులుగా భావించి, వారిపై సాయుద దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహోదగ్రులైన గ్రామస్థులు సాయుధ దళాల వాహనాలను తగులబెట్టి, ధ్వంసం చేశారు.
ప్రతిస్పందించిన భద్రతా దళాలు మరోసారి కాల్పులు జరపడంతో మరొక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది. నాగాలాండ్‌లో ఈ చట్టాన్ని ఉపసంహరించే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని గత ఏడాది ఏర్పాటు చేసింది.
గత ఏడాది డిసెంబరు 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వై పట్టోన్, ఎన్‌పిఎఫ్‌ఎల్‌పి నేత టిఆర్ జెలియాంగ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఇచ్చిన ట్వీట్లో, మంచి నిర్ణయాలు తీసుకునే సత్తాగల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన చర్యను చేపట్టిందని తెలిపారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లోని కల్లోలిత ప్రాంతాలను తగ్గించాలని నిర్ణయించిందన్నారు. అనేక దశాబ్దాల అనంతరం ఈ చర్యను తీసుకున్నట్లు తెలిపారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అస్సాం ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితం ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని ప్రయోగించారని, అయితే ఇప్పుడది తొలగించే సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. గతంలో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో తొలగించారని ఇప్పుడు అస్సాంకు సమయం వచ్చిందని హిమంత బిశ్వా శర్మ పేర్కొన్నారు