రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు సిఎంకు అందజేశారు. సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్లను సిఎం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉను సమస్యలు ఎక్కడివి అక్కడ పరిష్కారం అవుతాయని చెప్పారు.
భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చే నాటికి దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలని ఆదేశించారు. న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలన్నారు. దీనికోసం ప్రత్యేకంగా రోడ్‌మ్యాప్‌ను తయారు చేయాలని చెప్పారు. అంతిమంగా సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు పూర్తవ్వాలని సూచించారు.
భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో దేశానికి రాష్ట్రం ఒక దిక్సూచిగా నిలవాలని అందుకనే సీనియర్ అధికారులు, మంత్రులను భాగస్వాములను చేశామని తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఆ పని అత్యంత పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు.
ఎలక్ట్రానిక్ పద్దతుల్లో కాకుండా ఫిజికల్ రికార్డులు కూడా తయారు చేయాలని సూచించారు. ఫిజికల్ డాక్యుమెంటును కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, సబ్ డివిజన్ కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలని వివరించారు.
అధికారులు మాట్లాడుతూ పనివేగవంతం చేసేందుకు అదనంగా 20 డ్రోన్లను కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. వర్షాకాలం వచ్చేలోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ 1,441 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని చెప్పారు.
5,200 గ్రామాల్లో 2023 జులై నాటికి, 5,700 గ్రామాల్లో 2023 ఆగస్టు నెలాఖరునాటికి, సెప్టెంబరు నాటికి 6,460 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి క్లియర్ టైటిల్స్ ఇస్తామని తెలిపారు. ఈ సమీక్షలో ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బత్స సత్యనారాయణ, సిఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సిఎస్ డాక్టర్ సమీర్‌శర్మ, సిసిఎల్ఎ సాయిప్రసాదు తదితరులు పాల్గొన్నారు.