దేశంలో కల్లోలానికి దిగి ప్రధాని నరేంద్ర మోదీని అంతమొందించడం, ప్రధాన నగరాలలో భయోత్పాతం సృష్టికి దిగడం కోసం 20 స్లీపర్ సెల్స్ రంగంలోకి దిగాయా? ఇందులో ఎంతమేరకు నిజం ఉంది? అనే కీలక అంశాలను తేల్చేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) రంగంలోకి దిగింది.
దేశంలో ఇప్పటివరకూ నిద్రాణంగా ఉన్న 20 ఉగ్రవాద స్లీపర్‌సెల్స్ 20 కిలోల ఆర్డిఎక్స్ పేలుడు పదార్థాలతో చురుగ్గా ఉన్నాయని, ప్రధాన నగరాలను ఎంచుకుని 20 దాడులకు దిగనున్నారని వెలువడ్డ ఇ మొయిల్ నిజానిజాలపై నియా దర్యాప్తు చేస్తుంది.
ప్రధాని మోదీపై తనకు విద్వేషం ఉందని అంతమొందిస్తామని ఈ మొయిల్ పంపిన అజ్ఞాత వ్యక్తి ఇందులో తెలిపారు. ఇంటర్నెట్ వర్తమానం గురించి తెలియగానే దీనిపై వెంటనే స్పందించి జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగిందని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రధాని హత్యకు కుట్ర జరుగుతోందని ఈ ఇ మొయిల్ సమాచారంలో పేర్కొని ఉంది.
దేశంలోని 20 ప్రధాన నగరాలను ఎంచుకున్నారు. అక్కడ దాడులకు రంగం సిద్ధం అయిందని ఇందులో ఉంది. ఈ దశలోనే రాజస్థాన్‌లోని జైపూర్‌లో 12 కిలోల ఆర్‌డిఎక్స్‌ను అక్కడి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. వరుస బాంబు పేల్లుళ్లకు ఈ పేలుడు పదార్థాలు వచ్చినట్లు గమనించారు.
అయితే ఏ ఏజెన్సీ లేదా ఏ సంస్థకు ఈ ఇ మొయిల్ సమాచారం తొలుత అందిందనే విషయాన్ని నియా వర్గాలు తెలియ చేయలేదు. కానీ దీనిపై సమగ్ర దర్యాప్తు తంతును నియా ముంబై శాఖ చేపట్టిందని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇ మొయిల్ అందినట్లు ఓ పత్రిక పసికట్టింది. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు ఉగ్రవాద దాడులతో ప్రాణభయం పొంచి ఉందని ఈ సమాచారంతో నిర్థారించారు.
తన వద్ద 20 కిలోల ఆర్డిఎక్స్ ఉందని , తాను దేశంలోని 20 ప్రాంతాలలో భారీ దాడులకు రంగం సిద్ధం చేసుకున్నానని, ఇందుకు స్లీపర్ సెల్స్‌ను రంగంలోకి దింపానని ఆగంతకుడు తెలిపారు. తనకు ప్రధాని మోదీపై కోపం ఉందని, దేశంలోని దాదాపు 2 కోట్ల మందిని చంపివేస్తానని పేర్కొన్నట్లు ఈ మొయిల్ వివరాల అంశాలను ఓ ఆంగ్లపత్రిక తెలిపింది.
దేశంలో పలు ఉగ్రవాద శక్తులు నిద్రాణంగా ఉన్నాయని, ఇప్పుడు వాటిని చైతన్యం చేసి పేలుళ్ల బాధ్యతను అప్పగించినట్లు ఈ వ్యక్తి తెలియచేసుకున్నారు. అయితే పత్రికలలో వచ్చిన ఇ మొయిల్ వార్తలపై నిఘా వర్గాలు ఇప్పుడు స్పందించాయి ఇది నిజమే అని అయితే ఈ మొయిల్లోని అంశాల నిజానిజాలను నిర్థారించుకుంటున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి.
రాజస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) జరిపిన సోదాలలో భారీ స్థాయి ఆర్డిఎక్స్ దొరకడం సంచలనం అయింది. తరువాత గాలింపు దశల్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు జుబైర్, అల్టామస్, సర్ఫుద్దిన్ అలియాస్ సైఫుల్లాలను జైపూర్‌లోని ఓ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆర్డిఎక్స్ బాంబుల తయారీ సామాగ్రిని స్వాధీనపర్చుకున్నారు.
పదికిలోల ఆర్డిఎక్స్, నిందితుడి కారు నుంచి ఓ టైమర్ కనుగొన్నారు. నిందితులు అల్ సుఫా అనే పేరు మోయని ఉగ్రవాద సంస్థకు చెందినవారని నిర్థారించారు. అయితే ఇది ఏ ఇతర ప్రధాన ఉగ్రవాద సంస్థకు నిద్రాణ విభాగంగా వ్యవహరిస్తున్నదీ లేదా స్వతంత్రంగా పనిచేస్తోందా? అనేది తెలియలేదు.