`నేను చాలా స్ట్రాంగ్, నా తలను ఎవ్వరు వంచలేరు’ అంటూ ఆహ్వానించినా రాజ్ భవన్ లో జరిగిన ఉగాది ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటు అధికార పక్షం నేతలు ఎవ్వరు హాజరుకాకపోవడంపై గవర్నర్ డా. తమిళశై సౌందరాజన్ తీవ్రంగా స్పందించారు.
‘‘నేను వివాదాస్పదం చేసే వ్యక్తిని కాదు. గ్యాప్ సృష్టించే వ్యక్తిని కూడా కాదు” అంటూనే వచ్చే నెల నుంచి రాజ్ భవన్ లో ప్రజా దర్బార్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వంకు పరోక్ష హెచ్చరికలు పంపినట్లయింది. ఇది రాజ్‌భవన్ కాదు… ప్రజాభవన్ అని చెప్పడం ద్వారా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని సంకేతం ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు గ్యాప్ రావడానికి కారణం తెలియదని చెబుతూ సీఎం కేసీఆర్‌సహా రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పంపినప్పటికీ ఎవరూ హాజరుకాలేదు. పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా పెద్దగా కనిపించలేదని అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ‘‘ఉగాది వేడుకలు తెలంగాణలో నవశకం. మనం అంతా ఒక దగ్గర కూర్చొని తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలి. నాది స్నేహ పూర్వక వైఖరి. ప్రజల కోసమే నేను ఇక్కడ ఉన్నా” అని ఆమె స్పష్టం చేశారు.
‘‘నన్ను ప్రగతి భవన్లో ఉగాది వేడుకలకు ఆహ్వానించి ఉంటే ప్రొటోకాల్ ను పక్కనపెట్టి హాజరయ్యేదానిని. యాదాద్రికి నన్ను ఆహ్వానించలేదు… కానీ నాకు వెళ్లాలని ఉండే” అని ఆమె పేర్కొన్నారు. కొన్ని అంశాలపై కేసీఆర్ తో తనకు విబేధాలు ఉన్నాయని అంగీకరిస్తూ, తాను ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదని, అసలు పట్టించుకోలేదని అంటూ కేసీఆర్ ప్రభుత్వ వైఖరి పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.
‘‘సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లాను.. ఎవరో పిలుస్తరని, ఎవరో స్వాగతం పలుకుతారని నేను ఎదురుచూడను. ఎవరైనా సిస్టమ్‌ను ఫాలో అయితే చాలు’’ అని అన్నారు.
రాజ్‌భవన్ ఉగాది వేడుకలకు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహిత మొగిలయ్య, పలువురు వీసీలు, పుదుచ్చేరి మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పలువురు మహిళలకు , క్యాన్సర్ పేషెంట్లకు, దివ్యాంగులకు ఆర్థిక సాయం అందజేశారు.
కల్వకుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మినహా ఎవరూ హాజరు కాలేదు. జనవరి 26న కూడా రాజ్‌భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం విమర్శలకు దారి తీసింది. మార్చి 7 నుంచి నిర్వహించిన శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా నడపటంపై విమర్శలు వచ్చాయి. ఉగాది ఉత్సవానికైనా కేసీఆర్ వస్తారని రాజ్‌భవన్ వర్గాలు ఆశించాయి.
శుక్రవారం కేసీఆర్‌కు అధికార కార్యక్రమం ఏదీ లేకపోయినా రాజ్‌భవన్‌కు రాలేక పోయారంటూ చర్చించుకున్నారు. ప్రతినిధులుగా కొంత మంది మంత్రులను పంపినా బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి కూడా హాజరు కాలేదు. పాండిచ్చేరి మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం హాజరు కావాల్సిన సీఎస్ సోమే్‌షకుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి రాలేదు.