పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం మొదటి రోజు నుండి తన ప్రత్యేకత నిరూపించుకోవడం కోసం ఏదో ఒక వివాదాన్ని రేకెక్తినుంచే ప్రయత్నం చేస్తున్నది. తాజాగా, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న చండీఘడ్ పంజాబ్ కే దక్కాలంటూ మరో వివాదం లేవనెత్తింది.
పరిపాలనాపరంగా 60:40గా పంజాబ్, హర్యానాలు చండీగఢ్‌నును పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో చండీగఢ్‌పై సర్వహక్కులు పంజాబ్‌వేనని, అందుకే పూర్తిగా పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. తీర్మానాన్ని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రతిపాదించగా, ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా మద్దతు ప్రకటించారు. తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చండీగఢ్‌ను తక్షణమే పంజాబ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం శాసన సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాంతి, సామరస్యాలను పరిరక్షించేందుకు ఈ నగరాన్ని వెంటనే పంజాబ్‌కు అప్పగించాలని ఈ తీర్మానం కోరింది. గతంలో ఏదైనా రాష్ట్ర విభజన జరిగితే, రాజధాని నగరం మాతృ రాష్ట్రంతోనే ఉండేదని గుర్తు చేసింది.
ఇదిలా ఉండగాపంజాబ్ సర్వీస్ రూల్స్‌కు బదులు ఛండీగఢ్ ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మధ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చండీగఢ్ పంజాబ్‌కే పూర్తి రాజధానిగా ఉండాలంటూ తీర్మానం సీఎం భగవంత్ మాన్ ప్రవేశపెట్టడం విశేషం.
తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ ఛండీగఢ్ నుంచి కాకుండా బయటి వాళ్లను (కేంద్ర సర్వీస్ ఉద్యోగులతో) నియమించడం పట్ల భగవంత్ మాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంతకాలం కొనసాగిన సమతుల్యతను దెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.
భాక్రా బియస్ మేనేజ్మెంట్ బోర్డులో కేంద్ర ఉద్యోగుల్ని నియమించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛండీగఢ్ పంజాబ్ రాజధానిగా పునరుద్ఘాటించిన మాన్.. ఇంతకు ముందు ఇలా రాష్ట్రాలు విడిపోయిన సందర్భాల్లో రాజధాని మాతృ రాష్ట్రంలోనే ఉన్న విషయాన్ని సైతం ప్రస్తావించారు.
కాబట్టి, చంఢీగఢ్ను పంజాబ్‌కు బదిలీ చేయాలని స్పష్టం చేశారు. గతంలో సభ ఇందుకు సంబంధించి ఎన్నో తీర్మానాలు చేసినా లాభం లేకుండా పోయిందని, ఈసారి దానిని సాధించి తీరతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే పంజాబ్ అసెంబ్లీ తీర్మానాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ కొట్టిపారేశారు. చండీగఢ్ కు కేంద్ర పాలనా హోదా కొనసాగుతుందని స్పష్టం చేస్తూ, అక్కడ పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు వర్తిస్తాయని అమిత్ షా ప్రకటించడం పట్ల హర్షం ప్రకటించారు.
పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం పంజాబ్ రాష్ట్రం ఏర్పడింది. ఆపై పునర్వ్యవస్థీకరణతో హిందీ మాట్లాడే ప్రాంతాలతో హర్యానా పుట్టుకొచ్చింది. ఛండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా, పంజాబ్‌లో కొంత భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లో కలిసిపోయాయి. అప్పటి నుంచి భాక్రా బియస్ మేనేజ్మెంట్ బోర్డు లాంటి సంయుక్త ఆస్తుల మీద పరిపాలనను పంజాబ్-హర్యానాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.