ఉక్రెయిన్ పై దాడికి పాల్పడిన రష్యాపై ఆంక్షల విధింపులో కలసి రావాలని ఒక వంక అమెరికా, ఇతర ఐరోపా దేశాలు భారత్ పై వత్తిడి తెస్తున్న సమయంలో భారత్ పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం అంతర్జాతీయంగా రాజకీయ దుమారం రేపుతోంది.
యూకె, చైనా, ఆస్ట్రియా, గ్రీస్మె, క్సికో నుండి వచ్చిన మంత్రులతో సహా గత రెండు వారాల్లో భారత్ పర్యటనకు వచ్చిన మంత్రులను ఎవ్వరిని బహిరంగంగా కలవని ప్రధాని, కేవలం రష్యా మంత్రితో కలవడం, సుమారు 40 నిముషాల సేపు వ్యక్తిగతంగా సమాలోచనలు జరపడం ఆసక్తి కలిగిస్తున్నది.
ఉక్రెయిన్ యుద్ధంకు సంబంధించి భారత్ ఎటువైపు మొగ్గు చూపకుండా, మధ్యస్థంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఆచరణలో రష్యావైపు మొగ్గుచూపు తున్నట్లు స్పష్టం అవుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుండి ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా ఒక సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నట్లు లావ్రోవ్ చెప్పడం గమనార్హం.
‘అధ్యక్షుడు (పుతిన్), ప్రధానమంత్రి నిరంతరం టచ్‌లో ఉన్నారు. నా చర్చల గురించి నేను పుతిన్ కి నివేదిస్తాను. ఆయన ప్రధాని మోదీకి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఈ సందేశాన్ని నేను మోదీకి వ్యక్తిగతంగా అందజేస్తున్నాను’ అని రష్యా విదేశాంగ మంత్రి విలేకరులకు చెప్పారు.
రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి భారత్ పర్యటిస్తున్నారు. మాస్కోపై అమెరికా విధించిన ఆంక్షలను అతిక్రమించేందుకు ప్రయత్నించే దేశాలకు మూల్యం తప్పదని అమెరికా ఇదివరకే హెచ్చరించింది.
కాగా రాయితీతో కూడిన రష్యన్ చమురును భారతదేశం ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయగలదని నివేదికలు సూచిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూబుల్-రూపాయి ఏర్పాటుపై రెండు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.
లావ్ రోవ్ రాకకు కొన్ని గంటల ముందు, అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్, మాస్కోకు వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలను ‘పరిక్రమించడానికి లేదా తిరిగి పూరించడానికి’ (సర్కమ్వెంట్, బ్యాక్ ఫిల్) చురుకుగా ప్రయత్నిస్తున్న దేశాలకు తగిన పరిణామాలు ఉంటాయని అంటూ హెచ్చరించారు.
లావ్రోవ్ అంతకు ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘ఈరోజు మా సమావేశం కష్టతరమైన అంతర్జాతీయ వాతావరణంలో జరుగుతుంది’ అని జైశంకర్ ఒక సమావేశంలో చెప్పారు. రష్యా తన పొరుగు దేశం ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన తర్వాత ఈ సమావేశం మొదటిది కావడం గమనార్హం.
‘మా ఎజెండాను విస్తరించడం ద్వారా మేము మా సహకారాన్ని వైవిధ్యపరిచాము’ అని జైశంకర్ చెప్పారు. చర్చలు, దౌత్యం ద్వారా విభేదాలు, వివాదాలను పరిష్కరించుకోవడానికి భారతదేశం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, యుద్ధంపై భారతదేశం తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు లావ్రోవ్ ప్రశంసించారు. ‘భారతదేశం ఈ పరిస్థితిని కేవలం ఒక వైపు మాత్రమే కాకుండా పూర్తిగా ఎఫెక్ట్‌గా తీసుకుంటోంది’ అని కొనియాడారు. భారతదేశం, రష్యా మధ్య సంబంధాలను లావ్ రోవ్ ప్రశంసించారు, ‘గతంలో చాలా క్లిష్ట సమయాల్లో మా సంబంధాలు చాలా స్థిరంగా ఉన్నాయి’ అని కూడా ఆయన తెలిపారు.