దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న బాలీవుడ్ అగ్రనటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్ (37) మృతిచెందడం కలకలం రేపుతున్నది. ఈ కేసులో స్వతంత్ర సాక్షి అయిన ప్రభాకర్ శుక్రవారం మధ్యాహ్నం ముహల్ ప్రాంతంలోని తాను అద్దెకుంటున్న అపార్ట్మెంట్లో గుండెపోటుతో చనిపోయాడు.
ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. మృతి చెందిన సమయంలో ప్రభాకర్ ఇంట్లోనే ఉన్నాడని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో ఉన్న సోదరులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
డ్రగ్స్ క్రూయిజ్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కేసులో మరో సాక్షి అయిన కేపీ గోసావికి ప్రభాకర్ సెక్యూరిటీ గార్డుగా ఉన్నారు. కాగా, ఈ కేసులో అక్టోబర్ లో అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. మూడు వారాల తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు.
అయితే, ఇప్పటి వరకు ఆర్యన్ ఖాన్ పాత్రపై నిర్దుష్టంగా ఎటువంటి సాక్ష్యాధారాలు ముందుంచలేక పోతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, కేవలం రాజకీయ కక్ష కారణంగా అతనిని ఈ కేసులో ఇరికించారని తీవ్రమైన ఆరోపణలను మహారాష్ట్రలో అధికార కూటమి నేతలు చేస్తున్నారు.