భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక అని భారత ఉపరాప్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
కాలాన్ని గౌరవించడం, ప్రకృతిని పరిరక్షించడమే ఉగాది సందేశమని తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ పేర్లతో ఈపండగను జరుపుకుంటారని, వేరువేరు భాషలు, వేరువేరు పేర్లు, వేరవేరు సంప్రదాయాల మధ్య ప్రాధాన్యత కలిగిన పండగగా ఉగాది నిలిచిందని చెప్పారు.
ఉగాదితోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందనిచెబుతూ ప్రస్తుతం శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాదిని జరుపుకుంటున్నామని తెలిపారు. శుభకృత్ అంటే మేలును కలిగించేదని అర్థమని, ఈపండగ అందరి జీవితాల్లోకి సానుకూల మార్పును తీసుకురావాలని ఆకాంక్షించారు.
వసంత రుతువు ఆగమనానికి ప్రతీక అయిన ఉగాది వేళ వాతావారణంలో స్పష్టమైన మార్పు కనబడుతోందని చెప్పారు. ఉగాది పండగలోని ప్రతి సంప్రదాయం వెనుక వైజ్ఞానిక రహస్యాలు ముడిపడి ఉన్నాయని వెంకయ్యనాయుడు వివరించారు.
భారత్ ఎదుగుదల చూసి పాశ్చాత్య దేశాలకు అసూయ అని చెబుతూ మన ప్రగతిని అడ్డుకునేందుకు అనేక కుయుక్తులు పన్నుతారని హెచ్చరించారు. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వార్తలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కులం కంటే గుణం మిన్న అనేదాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
సంప్రదాయ దుస్తులు, ఆహారం.. పెద్దలు మనకిచ్చిన ఆస్తి అని గుర్తుచేశారు. ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ సాగి కమలాకరశర్మ పంచాంగ శ్రవణం చేశారు. వేడుకల్లో కామినేని శ్రీనివాస్, చిగురుపాటి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.