దేశంలోని మెట్రో నగరాలు, పట్టణాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసిందని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) కార్యకలాపాలు సాగిస్తున్న పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన యువకుడు మహమ్మద్ అబుసానిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుండి స్వాధీనం చేస్తుకున్న లాప్టాప్న పరిశీలించిన అనంతరం ఈ సమాచారం తెలుసుకొని విస్తుపోయారు.
ప్రార్థనా మందిరాలు, రద్దీగా ఉండే ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాలపై బాంబులతో దాడులు జరిపి విధ్వంసం సృష్టించేందుకు అబుసాని పథక రచన చేశారు. ఇతను ఐసిస్ సానుభూతిపరుడిగా ఎప్పటి నుంచి మారాడు? ఎంత కాలంగా సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఆకర్షించేందుకు వీడియోలు, ఐసిస్ సమాచారాన్ని పంపిస్తున్నాడు? అన్న విషయాన్ని తెలుసుకునే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా కొద్ది నెలల నుంచి ఐసిస్ సానుభూతిపరులను తయారు చేసేందుకు సామాజిక మాధ్యమాలను అబుసాని విస్తృతంగా వినియోగిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వెంటాడి పట్టుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో కూపీ లాగిన సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలిసింది.
ఇరాక్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా యువతను ఒక పథకం ప్రకారం రెచ్చగొట్టి జిహాద్ సైనికులుగా తయారు చేస్తున్న ఐసిస్ సంస్థ సభ్యులతో అబుసాని నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. అతడి పోస్టులను సోషల్ మీడియాలో గుర్తించి, కేసు నమోదు చేసి ఐపీ అడ్రస్‌ల ఆధారంగా ట్రేస్ చేశామని తెలిపారు.
సులేమాన్ పేరుతో 20 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు సులేమాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాతబస్తీకి చెందిన సులేమాన్ ఫలక్‌నుమా పరిధిలోని రైతు బజార్లో కొంతకాలంగా నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ్నించే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. కాగా, 2020లోనే పహాడీషరీఫ్‌లో సులేమాన్‌కు రాచకొండ ఎస్వోటీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సిలింగ్ తర్వాత కూడా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు.
ప్రత్యేకంగా యాప్‌లను సృష్టింటి వాటి ద్వారా తన స్నేహితులు, సన్నిహితులను జిహాద్ వైపు తిప్పుకునేందుకు అవసరమైన సమాచారాన్ని, వీడియోలను వారికి పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఐసిస్ సంస్థ నుంచి హవాలా ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో పోస్టులు పెడుతూ అతడు ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షించేలా ప్రయత్నిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.
ఐసిస్ ఉగ్రవాద సంస్థ తరఫున హైదరాబాద్‌లో కొందరు యువకులు గతంలోనూ పని చేశారని, వీరిలో 8 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నాలుగేళ్ల కిందట అరెస్టు చేసిందని ఈ సందర్భంగా పోలీసులు చెబుతున్నారు. మరో ఘటనలో 2018 సంవత్సరంలో ఇద్దరు యువకులను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దేశంలో మూడు ఐసిస్ మాడ్యూల్స్ యాక్టివ్ గా ఉన్నాయని భద్రతా సంస్థలు వెల్లడిస్తున్నాయి. భాగ్యనగరం.. అందునా పాతబస్తీ ఉగ్రవాద కార్యకలాపాలకు గత కొంత కాలంగా అడ్డాగా నిలుస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన సంఘటనలు ఇందుకు ఊతాన్నిస్తున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు, నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
పూర్తిస్థాయిలో భాగ్యనగరంలోని పాతబస్తీని జల్లెడ పట్టాయి.. పడుతున్నాయి. గతంలోనూ పాతబస్తీ కేంద్రంగా ఐసిస్ తన కార్యకలాపాలను విస్తృతం చేసిన సంగతి విదితమే. భాగ్యనగరం పాతబస్తీపై ఐసిస్ ఎన్నాళ్లుగానో కన్ను వేసింది. ఇందుకనుగుణంగా పలు దఫాలుగా ఐసిస్ పాతబస్తీపై గురిపెట్టినప్పటికీ ఎన్‌ఐఎతో పాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగా ఐసిస్ కుట్రలను బహిర్గతం చేసిన ఘటనలున్నాయి.