శ్రీలంకలో పరిస్థితి చేయిదాటిపోయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో లంకేయులు నరకం అనుభవిస్తున్నారు.పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించారు.
ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గెజిట్ విడుదల చేశారు.ప్రజలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
అధ్యక్ష భవనం ఎదుట గురువారం రాత్రి నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ మరునాడే ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం పశ్చిమ రాష్ట్రంలో ఆరు గంటల కర్ఫ్యూ విధించింది. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు పశ్చిమ ప్రావిన్సులో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
శ్రీలంకలో 22 మిలియన్ల జనాభా ఉన్నారు. 1948 నుంచి బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడం ఇదే మొదటిసారి. అందుకే ప్రజలు అర్ధరాత్రి కూడా ప్లకార్డులు, కాగడాలు పట్టుకుని రోడ్డుపై ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాజపక్స వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమర్జెన్సీ విధించిన తర్వాత శ్రీలంక రాజధాని కొలంబోలో తొలిరోజు (శనివారం) భారీ బందోబస్తు మధ్య దుకాణాలు తెరుచుకున్నాయి. ఆందోళనకారులు తీవ్రమైన నిరసనలకు దిగిన కారణంగా అనుమానితులను అరెస్ట్ చేయాలంటూ రాజపక్సే ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఎమర్జెన్సీ విధించినప్పటి నుంచి ఇప్పటిదాకా 53 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత్ భారీ సహాయం
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ తన వంతుగా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. రాజపక్సే ప్రభుత్వం భారత్‌ను సాయం కోరిన నేపథ్యంలో 40 వేల టన్నుల ధాన్యాన్ని, డీజిల్‌ను శ్రీలంకకు ఇండియా సరఫరా చేసింది.
భారత్ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఓడ శనివారం ఉదయం శ్రీలంకకు చేరుకుంది. దీంతో శనివారం సాయంత్రం వరకు శ్రీలంక వ్యాప్తంగా డీజిల్‌ను సరఫరా చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇండియన్ ఆయిల్ సంస్థ ఆరు వేల టన్నుల డీజిల్‌ను అందించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.