పంజాబ్ లో అనూహ్యంగా భారీ ఆధిక్యంతో అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఈఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్‌పై ఆమ్ ఆద్మీపార్టీ దృష్టి సారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి శనివారం గుజరాత్‌కు వచ్చారు.
ముందుగా, గాంధీజి స్మారక చిహ్నం అయిన సబర్మతీ ఆశ్రమాన్ని ఈ ఇరువురూ సందర్శించారు. శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరిన ఇరు రాష్ట్రాల సిఎంలు తెల్లవారుజామునే ఆశ్రమానికి వెళ్లారు. తొలుత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
తరువాత ఆశ్రమంలో బాపు ఎక్కువగా గడిపిన హృదయ్‌కుంజ్‌కు వెళ్లారు. అక్కడి మ్యూజియంలను సందర్శించారు. గాంధీకి అత్యంత ఇష్టమైన చరఖాపై నూలు వడికారు. కేజ్రీవాల్ , మాన్ ఆ తరువాత అక్కడి సందర్శకుల పుస్తకంలో తమ అనుభవాలను పొందుపర్చారు.
ఆశ్రమ అధికారులు ఇద్దరు నేతలకు చరఖా ప్రతిమ, గాంధీజి పుస్తకాలను కొన్నింటిని బహుకరించారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రిని అయిన తర్వాత సబర్మతి ఆశ్రమానికి రావడం ఇదే తొలిసారి అని కేజ్రీవాల్ విలేకరులకు తెలిపారు.
అంతకు ముందు తరచూ ఇక్కడికి వచ్చేవాడినని ఇక్కడికి వస్తే చెప్పలేని మానసిక అంతర్గత ప్రశాంతత దక్కుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆశ్రమం ఆథ్యాత్మిక ప్రదేశమని, గాంధీజీ స్ఫూర్తి తమలో ఆధ్యాత్మిక భావనలు రేకెత్తిస్తోందని గాంధీ పుట్టిన దేశంలో తాను జన్మించడం గర్వకారణమని కేజ్రీవాల్ తెలిపారు.
ఈ క్రమంలో భగవంత్ మాన్ స్పందిస్తూ.. గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని భిన్నమైన అనుభూతి కలుగుతోందని పేర్కొన్నారు. మరోవైపు.. వీరి పర్యటనలో రాజకీయ విషయాలపై మీడియా కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా ఇక్కడ రాజకీయాలు మాట్లాడవద్దని సున్నితంగా తిరస్కరించారు.
అహ్మదాబాద్ లో రోడ్ షో
ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌ను పాలించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ శనివారం సాయంత్రం “తిరంగా గౌరవ్ యాత్ర”పేరుతో రోడ్‌షోలో పాల్గొన్నారు. రథం ఆకారంలో తయారు చేసిన ట్రక్ పైనుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కేజ్రీవాల్ ముందుకు సాగారు.
దీనికి ముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ, 25 ఏళ్లుగా అధికారం సాగిస్తుండటంతో బీజేపీ పూర్తి అహంకారంతో ఉందని, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు రాజకీయాలు చేయడం రాదని, కానీ అవినీతిని ఎలా అంతం చేయాలో బాగా తెలుసునని చెప్పారు.
ఢిల్లీలో తాము అవినీతికి చరమగీతం పాడామని, పంజాబ్‌లో భగవంత్ మాన్ కేవలం పది రోజుల్లోనే ఆ పని చేసి చూపించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. భగవంత్ మాన్ మాట్లాడుతూ, ఢిల్లీ, పంజాబ్‌ల తర్వాత గుజరాత్ కోసం తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
రోడ్డుకు ఇరువైపులా ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు చేతిలో త్రివర్ణ పతాకాలు పట్టుకుని స్వాగతం పలికారు. గుజరాత్ ఆప్ నేతలు గాధ్వి, గోపాల్ ఇటాలియా తదితరులు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.
ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్ నేతలు ఇక్కడ పర్యటిస్తున్నారని రాజకీయంగా చర్చ నడుస్తోంది. కాగా, గుజరాత్‌లోని మొత్తం 182 స్ధానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఇప్పటి నుంచే గుజరాత్‌పై కేజ్రీవాల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.