ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు అవతరించాయి. సోమవారం ఎపి కొత్త జిల్లాలను సిఎం వైఎస్.జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. 42 ఏళ్ల తరువాత ఎపిలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 13 జిల్లాలు, 26 జిల్లాలుగా పున: వ్యవస్థీకరణయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటును సోమవారం తాడేపల్లి కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల కార్యాలయాల ద్వారా సేవలందించేందుకు .. ఆయా జిల్లాలకు చేరుకున్న ఉద్యోగులందరికీ కూడా, ప్రతి ఒక్కరికీ సిఎం జగన్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, అనకాపల్లి, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, బాపట్ల, ఎన్టీఆర్ పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని, స్వాతంత్య్ర సమరయోధులను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాలకు పేర్లు పెట్టినట్లు తెలిపారు. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే కొనసాగుతాయని తెలిపారు.
కనీసం ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గం చొప్పున 26 జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 1970 ప్రకాశం జిల్లా, 1979లో విజయనగరం ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దేశంలో 7వ అతిపెద్ద రాష్ట్రమైన ఎపిలో 13 జిల్లాలతో ఉన్నామని, అతి చిన్న రాష్ట్రాల్లో అరుణాచల్‌లో కూడా (కోటి 80 లక్షల జనాభా) 25 జిల్లాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఆగమశాస్త్ర పండితులు ఇచ్చిన సూచనల మేరకు కొత్తగా ప్రతిపాదించిన 13 జిల్లాలు, 23 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉదయం 9:05 గంటల నుంచి 9:45 గంటల మధ్య కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ), రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయాలు ప్రారంభమయ్యాయి.
కొత్తగా ఏర్పాటు చేసిన 23 రెవెన్యూ డివిజన్లతో కలిపి మొత్తం 73 రెవెన్యూ డివిజన్లు సోమవారం నుంచే పనిచేయడం ప్రారంభమయ్యాయి. కొత్త జిల్లాలకు ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. నిన్న కొంతమంది బాధ్యతలు స్వీకరించగా..మిగతా అధికారులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
కొత్త జిల్లా కేంద్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఉన్న జిల్లాల్లో కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే 13 జిల్లాల్లో రెండు చోట్ల అద్దె భవనాల్లో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిల్లో ప్రభుత్వ సొంత భవనాల్లోనే కొలువుతీరబోతున్నాయి.
గ్రామస్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణే సరైన విధానమని చెప్పారు. వికేంద్రీకరణతోనే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు.
కొత్త జిల్లాలతో మెరుగైన పాలనా, శాంతి భద్రతలు, పారదర్శకత ఉంటుందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు.