శ్రీలంక లాంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభం భారత్లో కూడా రావచ్చని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా కేంద్రం వద్ద తగినంత డబ్బులు లేవని ఆయన విమర్శించారు.
రెండేళ్లలో ఎఫ్సీఐకి రూ.4.27 లక్షల మేర సబ్సిడీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఈ పరిస్థితి కేవలం రెండేళ్లకు సంబంధించినదని చెబుతూ కేంద్రం వద్ద నిధులు లేవని, ఈ ప్రభుత్వం దివాళా తీసిందని రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు.
‘శ్రీలంక తీవర్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మన దేశ పరిస్థితి కూడా అటుఇటుగా అలాగే ఉంది. కాకపోతే శ్రీలంక బయటికి కనిపిస్తోంది. భారత్ అంతలా బహిరంగం కాలేదు. నిజానికి ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సరిగా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది’ అని ఆయన తెలిపారు.
కేంద్ర ఉన్నతాధికారుల ఆందోళన
ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని ప్రజాకర్షక పథకాలతో ఆయా రాష్ట్రాలు భవిష్యత్తులో శ్రీలంకవంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో శ్రీలంక సంక్షోభంపై చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజాకర్షక పథకాలపై కేంద్ర ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక రాష్ట్రంలో ప్రకటించిన పథకం ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించేదిగా ఉందని, ఇలాంటి పథకాల్నే చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.
ఈ పథకాలు అమలు చేయడం వల్ల ఆయా రాష్ట్రాలు ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోతాయని, ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని భవిష్యత్తులో ఆ రాష్ట్రాలు కూడా ఎదుర్కోవచ్చని వారు ప్రధానికి వివరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓట్లు రాబట్టుకునేందుకు పలు పార్టీలు ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక ఈ పథకాల్ని అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోందని స్పష్టం చేశారు.