టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి హైకోర్టుకు బే షరతుగా లిఖితపూర్వక క్షమాపణ తెలిపారు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు విచారణను హైకోర్టు ముగించింది. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్న సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేసీఆర్ కు వెంకట్రామిరెడ్డి పాదాభివందనం చేయడం దుమారం రేపింది. ఆయన ఏకపక్షంగా, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు ఈ ఘటనే ముఖ్య నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.
ఐఏఎస్ స్థాయిలో ఉంటూ ఇలా వ్యవహరించడం సరికాదన్న కామెంట్స్ పరిణామాలపై వెంకట్రామిరెడ్డి స్పందించి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఏం జరిగిందో కానీ కొద్ది రోజులకే టీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న సమయంలో వరి సాగు చేపట్టొద్దంటూ వ్యాపారులెవరూ వరి విత్తనాలు కూడా అమ్మొద్దంటూ మౌఖిక ఆదేశాలిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కోర్టు నుండి ఆదేశాలు తెచ్చుకున్న పట్టించుకోమన్నారనే ఆరోపణలు రావడంతో కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయింది.
కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారని హైకోర్టు విచారణ చేపట్టగా సోమవారం విచారణకు వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి.. తాను సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యల అభియోగాలపై బేషరతుగా హైకోర్టుకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పారు. దీంతో హైకోర్టు కేసు విచారణ ముగించింది.