మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కోరినట్లు చేయడం అసాధ్యం అంటూ పాకిస్థాన్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. దానితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, 90 రోజులలో ఎన్నికలు జరిపించి, తిరిగి అధికారంలోకి రావాలని ఇమ్రాన్ వేసుకున్న ఎత్తుగడ తలకిందులయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
న్యాయపరమైన, రాజ్యాంగపరమైన, లాజిస్టికల్ సవాళ్ల కారణంగా ఈ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించడం సాధ్యం కాదని కమీషన్ తేల్చి చెప్పింది.ఎన్నికల నిర్వహణకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని స్పష్టం చేసింది.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ముఖ్యంగా కైబర్ పక్తూంక్వాలో నియోజకవర్గాలు పెరగబోతుండటం, ల్లా, నియోజకవర్గాలవారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయడం వంటి ప్రధాన సవాళ్ల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సుమారు ఆరు నెలల సమయం అవసరమని తెలిపింది.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని, చట్ట ప్రకారం అభ్యంతరాలను తెలపడానికి ఒక నెల సమయం ఇవ్వాలని కమీషన్ అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం, ఎన్నికల షెడ్యూలును నాలుగు నెలల ముందుగా ప్రకటించవలసి ఉంటుందని గుర్తు చేశారు.
అలాగే ఎలక్షన్ మెటీరియల్‌ను సేకరించడం, బ్యాలట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ సిబ్బందికి శిక్షణకు కొంత సమయం పడుతుందని దీంతో మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు. ప్రస్తుతం పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్ లోకల్ గవర్నమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంటును రద్దు చేయాలని, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీకి సిఫారసు చేశారు.
కొద్దిసేపటికే నేషనల్ అసెంబ్లీని రద్దు చేసినట్లు అల్వీ ప్రకటించారు. కాగా, అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.