జమ్మూకశ్మీరులోని సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు సమాయత్తం అయ్యారని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేర సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)మంగళవారం హైఅలర్ట్ ప్రకటించింది.
పాకిస్థాన్ దేశంలో నెలకొన్న రాజకీయ గందరగోళం నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులు భారత్ సరిహద్దుల్లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారని కేంద్ర భద్రతాదళాలకు సమాచారం అందింది. గత వారం రోజుల్లో 117 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీరులోని బందిపొరా జిల్లాలోని గురేజ్ సెక్టారు, కుప్వారా జిల్లాలోని కేరన్, మచిల్ సెక్టార్లకు చేరుకున్నారని సమాచారం వచ్చింది.
దీంతో సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ దగ్గర 24 పోస్టుల వద్ద బీఎస్ఎఫ్ సిబ్బంది గస్తీ తిరుగుతున్నారు.కెరాన్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి లష్కరే తోయిబా, జైషే మహ్మద్, అల్ బదర్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన 41 మంది కార్యకర్తలు పీఓకేలో ఉన్నారు. ఈ ఉగ్రవాదులు దుధానియాల్, అత్ముగం లాంచ్ ప్యాడ్ల వద్ద ఉన్నారని నిఘా వర్గాలు భద్రతా బలగాలకు సమాచారం అందించాయి.
గురేజ్లోని సరిహద్దుకు అవతలి వైపున పీఓకేలోని మూడు లాంచ్ ప్యాడ్ల వద్ద 30 మంది ఉగ్రవాదులు ఉన్నారు.లోసార్ కాంప్లెక్స్, సోనార్, సర్దారి, నౌషేరా నార్, గోవింద్ నాలా, పరిబల్ ఫారెస్ట్ వంటి మార్గాల ద్వారా ఉగ్రవాదులు బండిపొరాలోకి చొరబడవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి.
సర్దారీ, కెల్, తేజిన్లోని లాంచ్ ప్యాడ్ల వద్ద 46 మంది ఉగ్రవాదులు మచిల్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఉగ్రవాదులు రింగ్ పెన్, కుమ్కారి గాలి ద్వారా కుప్వారాలోకి ప్రవేశించవచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.
స్థానిక ఉగ్రవాదుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో జమ్మూ కశ్మీర్లో విదేశీ ఉగ్రవాదుల ఉనికి పెరిగినట్లు నిఘావర్గాలు వెల్లడించాయి. సమస్యాత్మక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 172 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం చురుకుగా ఉన్నారు. వీరిలో 79 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు, 93 మంది స్థానిక తీవ్రవాదులు ఉన్నారని జమ్మూకశ్మీర్ పోలీసులు చెబుతున్నారు.