నగరంలో ఎన్నో పబ్‌లపై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నా.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కొన్నింటిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని పబ్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనను ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు.
అధికార పార్టీ నేతలు నడిపే పబ్‌లపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేందంటూ ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్‌లో బట్టబయలైన డ్రగ్స్ పార్టీ సంచలనం రేపుతోంది, సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలే కాకుండా మైనర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆమె చెప్పారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని ఆమె స్పష్టం చేశారు.
కానీ కేసీఆర్ సర్కార్ మోద్దు నిద్ర పోతోందని, హైదరాబాద్‌లోని ఎన్నో పబ్స్ మీద డ్రగ్స్ ఆరోపణలున్నా, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొకైన్, చరస్ లాంటి మత్తు పదార్థాలతో విచ్చలవిడిగా దందా నడిపిస్తున్నా బంజారాహిల్స్‌లోని ఒక పబ్ పైనే రెయిడ్స్ చేయడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆమె తెలిపారు. రాజకీయ ఉద్దేశాలతోనే ఈ దాడులు చేశారని ఆమె విమర్శించారు.
ఇంకా దర్యాప్తు పూర్తి కాకముందే, డ్రగ్స్ ఎవరు తీసుకున్నారనేది తేలకముందే.. కొందరిపై టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా విమర్శలు చేయడం ఇటువంటి అనుమానాలను బలపరుస్తున్నట్లు ఆమె తెలిపారు. 145 మందిని అదుపులోకి తీసుకొని, వాళ్లను కొన్ని గంటలపాటు స్టేషన్లో ఉంచి, ఒక్కరి రక్త నమూనా కూడా సేకరించకపోవడమేంటీ..? అని విజయశాంతి విస్మయం వ్యక్తం చేశారు.
కావాలనే కొన్ని పేర్లను మీడియాకు లీక్ చేశారని ఆమె ధ్వజమెత్తుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 పబ్స్ ఉండగా, . 10 స్టార్ హోటల్స్‌లో 24 గంటలు లిక్కర్ సప్లయ్ చేసేందుకు అనుమతులున్నాయని ఆమె గుర్తు చేశారు. ఇలా పర్మిషన్ అనుమతి ఇచ్చిన వాటి నుంచి ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఫీజు వసూలు చేస్తుందని ఆమె చెప్పారు.
గతంలో సినీ హీరోలు, సెలబ్రిటీలు పబ్స్ నిర్వహించే వారని, కొన్నిటిపై దాడుల సందర్భంగా హీరోల పేర్లు బయటకు రావడంతో కొంత కాలానికే అవి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయని ఆమె ఆరోపించారు. వాళ్లు కావాలనే ఇతర పబ్‌లపై దాడులు చేయిస్తున్నారని పేర్కొంటూ, అధికార పార్టీ నేతలు నడిపే వాటిలో ఇంత కన్నా దారుణంగా డ్రగ్స్ దందా నడుస్తోందని విజయశాంతి ఆరోపించారు.
వీటిపై సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని, కమిటీపై ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. తెలంగాణను మరో పంజాబ్ కాకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యువతను డ్రగ్స్ నుంచి దూరం చేయల్సిన బాధ్యత మన అందరీపైనా ఉందని చెబుతూ డ్రగ్స్ దందా చేస్తున్న ఈ దగాకోరు సర్కార్‌ను గద్దె దించుదామని ఆమె రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చారు.