‘బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ స్వయంగా కేంద్రానికి లేఖ రాసి, రైతుల్ని నట్టేట ముంచాడని విమర్శిస్తూ కేసీఆర్ సంతకం రైతులకు మరణశాసనమైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి కూడా కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎలా లేఖ రాశారు? అంటూ ఆమె ప్రశ్నించారు.
ఆమె చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ యాత్ర 47వ రోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తాళ్ల చెరువు గ్రామంలో కొనసాగుతోంది. కూసుమంచి మండలం పెద్దపోచారం గ్రామంలోని రైతు వేదిక దగ్గర… యాసంగి వడ్లను కేసీఆర్ కొనాలని డిమాండ్ చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన అపరమేధావికి ఈ విషయం తెలియదా? అంటూ ఆమె ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
కేసీఆర్ లేఖ వల్లనే కేంద్రం వడ్లు కొనమని చెబుతోందని పేర్కొంటూ, అందువల్ల కేసీఆరే వడ్లన్నీకొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వరి వేసుకునే హక్కు రైతులకు ఉందని స్పష్టం చేస్తూ దాన్ని కాలరాసే అధికారం ఎవరికీ లేదని ఆమె తేల్చి చెప్పారు. కేసీఆర్ తప్పులకు రైతులను శిక్షించడం న్యాయం కాదని ఆమె హితవు చెప్పారు.
కేసీఆర్ బేషరతుగా ముక్కునేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని కోరుతూ షర్మిల ట్వీట్ చేశారు. పక్క రాష్ట్రాలు కనీస మద్దతు ధరపైన బోనస్ ఇచ్చి మరీ సన్నబియ్యాన్ని కొంటున్నాయని చెబుతూ తెలంగాణలో కనీస మద్దతు ధరకైనా బియ్యం కొనాలన్న సోయి సీఎం కేసీఆర్కు లేదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
సబ్సిడీ ఎరువులు, విత్తనాలు ఇవ్వట్లేదని… రైతులు అప్పులపాలు కావడానికి కారణం కేసీఆరే అని ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనమని.. ఏ రైతుని అడిగి ఒప్పందంపై సంతకం చేశారని కేసీఆర్ని ప్రశ్నించారు షర్మిల. రైతులకు క్షమాపణలు చెప్పి.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, నిరుద్యోగులు చేసు కుంటున్న ఆత్మహత్యలన్నీ.. సీఎం కేసీఆర్ చేస్తున్న హత్యలేనని షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బీరోలులో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష ’నిర్వహిస్తూ డిగ్రీలు, పీజీలు చేసిన అభ్యర్థులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఐదారు తరగతులు చదివినవారు ఎమ్మెల్యేలు, మంత్రులుగా చెలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి 2004, 2006, 2008లో డీఎస్సీలు నిర్వహించడమే కాక, ప్రైవేట్ రం గంలో 11 లక్షల ఉద్యోగాలు కల్పించి, కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేశారని ఆమె గుర్తు చేశారు.
ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల్లో మనోధైర్యం నింపడానికి కూడా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యత్నించ డం లేదని విమర్శించారు. ఇకనైనా 1.91లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఇప్పటివరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు.