ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల భవితవ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి చదువు కొనసాగింపుకు భరోసా ఇస్తూ విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్లోని పరిస్థితులుపై లోక్సభలో చర్చ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ విదేశీ విద్యార్థులకు సడలింపు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
భారత విద్యార్థులను అకామిడేట్ చేయడానికి.. హంగరీ, పొలాండ్, చెక్ రిపబ్లిక్ సహా పలు దేశాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని వివరించారు. రష్యా సైనిక చర్య నేపథ్యంలో అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉక్రెయిన్ నుంచి కేంద్రప్రభుత్వం భారతీయులను తరలించింది.
ఆపరేషన్ గంగ ద్వారా దాదాపు 25వేల మంది భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే మెడికల్ స్టూడెంట్స్ చదువు అర్థాంతరంగా ఆగిపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను భారతీయ వైద్య కళాశాలల్లో అకామిడేట్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు పార్లమెంట్లో కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.
కాగా, శాంతి, అహింసే భారత విధానమని మరోసారి స్పష్టంచేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ వ్యతిరేకమని జైశంకర్ స్పష్టం చేశారు. ఒక పక్షం వైపు నిలబడాల్సి వస్తే.. అది శాంతి పక్షమేనని తేల్చి చెప్పారు. దేశ నమ్మకాలు, విలువలు, జాతీయ ప్రయోజనం, వ్యూహం ప్రకారమే భారత వైఖరి ఉంటుందని చెప్పారు.
బుచా మారణకాండ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెబుతూ ఇది తీవ్రమైన అంశమని.. స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న వాదనకు మద్దతు పలుకుతున్నామని తెలిపారు. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలు పణంగా పెట్టడం ద్వారా.. ఏ సమస్యకు పరిష్కారం దొరకదని పార్లమెంట్ వేదికగా ఉక్రెయిన్, రష్యాలకు సూచించారు