భారతీయ జనతాపార్టీ దేశభక్తికి అంకితమైతే, ప్రత్యర్ధి పార్టీలు బంధుప్రీతికి మొగ్గు చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే ప్రజాస్వామ్యానికి వంశపాలన పార్టీలు ప్రధానశత్రువులని క్రమంగా ప్రజలు తెలుసుకున్నారని ప్రధాని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మోదీ పార్టీ కార్యకర్తలతో వర్చ్యువల్ గా మాట్లాడుతూ వంశపాలన పార్టీలు రాజ్యాంగ నిబంధనలపై తక్కువ గౌరవ భావం కలిగి కుటుంబ పాలనకే అంకితమయ్యారని ఆరోపించారు.
వివిధ రాష్ట్రాల్లో అవి చురుకుగా ఉన్నప్పటికీ, అవినీతి, ఇతర దుశ్చర్యలు పరస్పరం కప్పిపుచ్చుకొంటుంటాయని వ్యాఖ్యానించారు. రష్యాఉక్రెయిన్ సంక్షోభం గురించి మాట్లాడుతూ ఈ సమయంలో ప్రపంచం మొత్తం రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఎటువంటి ఒత్తిడులకు తలొగ్గకుండా అంతర్జాతీయ సమాజం ముందు దృఢంగా నిల్చుందని పేర్కొన్నారు.
రాజకీయ ప్రత్యర్ధులను లక్షంగా చేసుకుని మాట్లాడుతూ ఈ పార్టీలు జాతీయ స్థాయిలో లేదా రాష్ట్రస్థాయిలో అధికారం లోకి రాడానికి క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటాయని విమర్శించారు. కొన్ని కుటుంబాలు స్థానిక పాలక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు ఆధిపత్యం చెలాయిస్తుంటాయని చెబుతూ బిజెపి ఒక్కటే వారికి సవాలుగా ఎన్నికల్లో తన సత్తా చూపిస్తోందని స్పష్టం చేశారు.
ప్రత్యర్ది పార్టీలు యువనైపుణ్యాన్ని మీదకు తీసుకురాకుండా వారిని మోసగించాయని పార్టీ పేరు చెప్పకుండా ప్రధాని ఆరోపించారు. ఆయా పార్టీల అన్యాయానికి, అరాచకాలకు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు ప్రజాస్వామ్య విలువలతో పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. కొందరు తమ జీవితాలనే త్యాగం చేశారని చెబుతూ విపక్ష పార్టీల పాలనలో ఉన్న పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలలో రాజకీయ హింసకు బిజెపి కార్యకర్తలు బలవ్వడాన్ని ఉదహరించారు.
ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు ఓటమి పొందేవరకు తమ పోరాటం కొనసాగుతుంటుందని ప్రధాని స్పష్టం చేశారు. భారత్ 75 వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న తరుణంలో ఈ వ్యవస్థాపక దినోత్సవం ఎంతో ముఖ్యమైన స్ఫూర్తి నింపే గొప్ప సందర్భమని చెప్పారు. అలాగే వేగంగా మారుతున్న ప్రపంచ ప్రాథమ్యాలతో మన దేశానికి కొత్త అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బిజెపి విజయం సాధించడాన్ని ప్రస్తావిస్తూ మూడు దశాబ్దాల తరువాత ఒక పార్టీ రాజ్యసభలో 100 మంది సభ్యుల మార్కును చేరుకుందని పార్టీ కార్యకర్తల కృషిని కొనియాడారు. కేంద్రంలోను, రాష్ట్రాల్లోను ఉన్న బిజెపి ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి విచక్షణ లేకుండా ప్రతిలబ్ధిదారునికి అందేలా కృషి చేశాయని హామీ ఇచ్చారు.