తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌కు మధ్య చెలరేగిన ప్రోటోకాల్ వివాదం ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చేరింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడంలేదంటూ ప్రధానికి గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
గవర్నర్ కార్యాలయ ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించడంలేదని, ఉద్దేశపూర్వకంగానే అలా వ్యవహరిస్తున్నారని పిఎం దృష్టికి ఆమె తీసుకెళ్లారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ భేటీఅయి రాష్ట్రంలోని తాజా పరిణామాలను ఆయనకు వివరించారు.
సాంకేతిక కారణాల సాకుతో బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగంలేకుండా చేశారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజ్‌భవన్ ప్రమేయం ఉండకూడదనే విధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. ప్రధానంగా సిఎస్, సీనియర్ ఐఎఎస్‌లు కొంతమంది సహకరించడంలేదని ప్రధానికి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరిపై కూడా ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ప్రధానితో భేటీ అనంతరం విలేకరులతో గవరుర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని ఆమె కోరారు.
చట్టప్రకారం, రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటున్న తనను తెలంగాణ ప్రభుత్వం అవమానించడం సరికాదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తనకున్న అధికారాలను ప్రయోగించి చర్యలు తీసుకొని సమస్య సృష్టించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.
వ్యవస్థ, చట్టప్రకారం నడుచుకుంటానని, దాన్ని అనుసరిస్తూ పనిచేస్తున్నప్పుడు వేరేరకంగా భావించి గవర్నర్‌ను ప్రభుత్వం అవమానించడం సరికాదని ఆమె హితవు చెప్పారు. ‘‘తమిళిసైని కాదు గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించండి. ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ, దేశ ప్రజలకే వదిలేస్తున్నా. గవర్నర్ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?” అంటూ ఆమె ప్రశ్నించారు.
” అది ఇలా చేయాలి… ఇది అలా చేయాలని నా అధికారాలను ప్రయోగించడం లేదు. నేను మహిళా గవర్నర్‌ను, నా విధులు పారదర్శకంగా ఉన్నాయి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.’’ అని తమిళిసై చెప్పారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక పేరును సేవారంగం నుంచి తనకు ప్రతిపాదించిందని, ఆ వ్యక్తి ఎలాంటి సేవా చేయలేదని భావించి తన అభిప్రాయాన్నీ ప్రభుత్వానికి చెప్పానని ఆమె తెలిపారు. ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె స్పష్టం చేశారు.
సిఎస్‌కు ప్రొటోకాల్ తెలియదా? అని గవర్నర్ ప్రశ్నించారు. వ్యక్తులను కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె హితవు చెప్పారు. తనను ఎవరూ అవమానించలేదని, తనకెంలాంటి ఇగోలూ లేవని తెలిపారు. సిఎం, మంత్రులు ఎప్పుడైనా రాజ్‌భవన్‌కు రావొచ్చని, ఎవరైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చని ఆమె పెర్కోన్నారు.
తెలంగాణ రాష్ట్ర జనాభాలో 11 శాతంగా ఉన్న గిరిజనుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని కోరానని కూడా ఆమె చెప్పారు.