దేశంలో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో.. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోసు వేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఆదివారం నుంచి అర్హులైన వారందరికీ ఈ డోసు వేయనున్నట్టు ప్రకటించింది. ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
ఈ వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ప్రికాషన్ డోసు పేరుతో 18 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చే ఈ వ్యాక్సిన్.. ప్రైవేటు కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతో వేగంగా ముందుకు వెళ్తున్నదని వివరించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయితే.. ఈ బూస్టర్ డోసుకు అర్హులని, అదేవిధంగా 18 ఏళ్లు నిండి ఉండాలని సూచించింది. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ప్రస్తుతం తొలి, రెండు డోసుల పంపిణీ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది.
ఆరోగ్య కార్యకర్తలు/60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు ఇస్తూనే ఉంటామని ప్రకటించింది. దేశంలో 15 ఏళ్లు పైబడిన 96 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని, 83 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు 60 ఏళ్లు పైబడిన దీర్ఘ కాలిక వ్యాధులతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి జనవరి 10 నుంచే ప్రికాషన్ డోసు ఇస్తున్నారు. ఆ తరువాత 60 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ ఈ డోసు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. తాజాగా 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికి బూస్టర్ లేదా ప్రికాషన్ డోసు ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఇప్పటి వరకు ప్రికాషన్ డోసు తీసుకున్న వారి సంఖ్య 2.4 కోట్లకు చేరుకుంది. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఇక 12 – 14 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నది. సుమారు 45 శాతం మందికి తొలి డోసు అందించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మాస్క్‌తో పాటు సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని తెలిపింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మళ్లిd కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.