ఆంధ్రప్రదేశ్ పునర్విభజన పై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై ఉండవల్లి గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు.
సామరస్య విభజనకు నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో కొన్ని తప్పులు జరిగాయని, విభజన ప్రక్రియ సరిగా జరగలేదని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మళ్లీ సవరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పునర్విభజన నిబంధనల విషయాన్ని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
ఈ పిటిషన్ దాఖలు చేసి ఇప్పటికే చాలా కాలం అయిందని న్యాయవాది ప్రశాంతభూషణ్ గుర్తు చేశారు. ఆయన సూచనను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం దీనిపై త్వరితగతిన విచారణకు జరిపేందుకు అంగీకరించింది. త్వరగా విచారణ జరిపేందుకు వచ్చేవారం లిస్టులో ఈ పిటిషన్ ను పొందుపరచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం.