ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు కేసులకు సంబంధించి విచారణ ముగించిన ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
జైలు శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా విధించింది. పాక్ కోర్టు ఆదేశాల మేరకు హఫీజ్ సయీద్ అక్రమంగా నిర్మించిన మసీదు, మదర్సాను సీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ పోలీస్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్లపై ఉగ్రవాద వ్యతిరేక కోర్టు న్యాయమూర్తి ఇజాజ్ అహ్మద్ భుట్టర్ ఈ తాజా తీర్పు ఇచ్చారు.
2019 నుంచి భారీ భద్రత మధ్య సయూద్‌ను ఉంచిన లాహోర్‌లోని లఖ్‌పట్ జైలు నుంచి ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లలో మొదటి కేసులో 15.5 సంవత్సరాలు, రెండో కేసులో 16.5 సంవత్సరాలు కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది
హఫీజ్ సయీద్‌కు జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి కాదు. ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి 2020లో యాంటీ టెర్రర్ కోర్టు ఆయనకు15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2019లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటన సమయంలో హఫీజ్ సయీద్‌ను అరెస్ట్ చేశారు.
డెబ్బై ఏళ్ల సయీద్‌కు గతంలో 5 కేసుల్లో 36 ఏళ్ల జైలు శిక్ష పడింది. తాజా శిక్షతో ఆయనకు విధించిన జైలు శిక్ష 68 ఏళ్లకు చేరింది. ఏకకాలంలో శిక్ష అమలు అవుతున్నందున ఆయన ఎంతో కాలం జైలు జీవితం గడపకపోవచ్చని ఆయన తరఫు న్యాయవాది ఒకరు తెలిపారు.
కాగా, 2020లో టెర్రర్ ఫండింగ్ కేసులో యాంటీ టెర్రర్ కోర్టు సయీద్‌కు 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2019 జూలైలో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో సయీద్ అరెస్టయ్యాడు.
ఇదిలా ఉంటే 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అతని ప్లాన్ మేరకే పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చొరబడి పలు ప్రాంతాల్లో మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 175 మంది మృతి చెందగా.. 300 మందికిపైగా గాయపడ్డారు.