బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్ని కలసి రావాలని పిలుపిచ్చింది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐక్య కూటమి ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ లను ఒంటరి చేయాలని సిపిఎం కాంగ్రెస్ లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపిచ్చిన రెండు రోజులకే రాహుల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఇటీవలనే ఆర్జేడీతో చేరిన శరద్ యాదవ్ ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి రావాలని స్పష్టం చేశారు. అయితే, అవి ఎలా కలిసి రావాలి, ఎలాంటి ఫ్రేమ్‌వర్క్ ఉండాలి, ఏం అభివృద్ధి చేయాలి అనే అంశాలపై చర్చలు చేస్తున్నామని రాహుల్ తెలిపారు.
భారతదేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “భారత ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరిస్థితిని మీరు ఊహించలేరు. మీ జీవితంలో తదుపరి ఏమి జరుగుతుందో మీరు చూడలేరు” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశపు ఉపాధి నిర్మాణం, దాని వెన్నెముక. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, చిన్న దుకాణదారులు.. అనధికారిక రంగం మనకు వెన్నెముక. కానీ, ఆర్థికవేత్తలు, బ్యూరోక్రాట్లు ఇతర దేశాలను చూసి తమ ప్రణాళికలు వేస్తారు. మనం వారిలా మారాలని ప్రధాని చెప్పారు. కానీ, ఇక్కడ మనం అలా చేయలేము. ముందుగా మనం ఎవరో, ఇక్కడ ఏమి జరుగుతుందో గ్రహించాలని చురకలు అంటించారు.
వారు మన వెన్నెముకను దెబ్బతీస్తన్నారని చెబుతూ దీంతో రాబోయే 34 ఏళ్లలో భయంకరమైన ఫలితాలు వస్తాయని రాహుల్ హెచ్చరించారు. నేడు దేశం చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని చెబుతూ విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని చీల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతిని ఏకతాటిపైకి తెచ్చి ఆ బాటలో నడవాలని రాహుల్ గాంధీ సూచించారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంక్షోభంపై వ్యాఖ్యానించాల్సిందిగా ఆయనను కోరగా, ఉక్రెయిన్‌కు రష్యా అనుసరించిన సూత్రాన్నే చైనా కూడా వర్తింపజేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్, లడఖ్ మధ్య సమాంతరాన్ని గీయడం ద్వారా రాహుల్ గాంధీ “వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించడం లేదు” అని మండిపడ్డారు.
“ఉక్రెయిన్ ప్రాదేశికతను తాము అంగీకరించబోమని, డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను ఉక్రెయిన్‌లో భాగంగా పరిగణించడం లేదని రష్యా చెప్పింది. దాని ఆధారంగానే రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. లక్ష్యం ఏమిటి? నాటో-ఉక్రెయిన్-అమెరికా కూటమిని విచ్ఛిన్నం చేయడం” అని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
“చైనా అదే సూత్రాన్ని భారత్‌కు వర్తింపజేస్తోంది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లు మీవి కావు అని చైనా చెబుతోంది. వారు అక్కడ తమ సైన్యాన్ని మోహరించారు. ప్రభుత్వం దీనిని విస్మరిస్తోంది” అని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై మండిపడ్డారు.