విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాల పట్ల తీవ్ర నిరసనలు ఎదురవుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకెళ్లడానికే సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజిమెంట్ (దీపం) నుంచి ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడులను వ్యూహాత్మకంగా ఉపసంహరించేందుకుగాను ఇటీవల పిలిచిన టెండర్లకు పది సంస్థలు బిడ్లను దాఖలు చేసేందుకు సుముఖంగా ఉన్నాయి.
ఈ అంశాన్ని శనివారం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణ మండలి వెల్లడించింది. స్టీల్‌ప్లాంట్ ఆస్తుల విలువ లెక్కకట్టేందుకుగాను ఆ పది సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ అత్యధిక సంస్థలు తమ బిడ్లను దాఖలు చేశాయి.
ఎఎఎ వేల్యూయేషన్ ప్రొఫెషనల్స్ ఎల్ఎల్పి, అడ్రాయిట్ అప్రైజర్స్ అండ్ రీసెర్చి ప్రైవేట్ లిమిటెడ్, అమిత్‌కుమార్ కంకానే, భావిన్ ఆర్ పాటెల్, సిపిఎ వేల్యూయేషన్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గా అడ్వైజర్ ఎల్ఎల్పి, టి టెక్ వేల్యూయర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్బిఎస్ఎ అడ్వైజర్స్ ఎల్ఎల్పి, రిజల్యూట్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్కె అసోసియేట్స్ వేల్యూయర్స్ అండ్ టెక్నో ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్లను దాఖలు చేసిన వాటిలో ఉన్నాయి.
కాగా, స్థానికంగా స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడానికి 420 రోజులపైబడి కార్మికులు ఉద్యమిస్తున్నారు. విలువ కట్టడానికి ఏ సంస్థ అయినా కంపెనీలోకి అడుగుపెడితే కార్మికులు ప్రతిఘటించడం ఖాయమని, తర్వాత జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్టీల్‌పాంట్ కార్మికులు హెచ్చరిస్తున్నారు.