దేశంలో ఆంగ్ల భాషకు ప్రత్యామ్నాయంగా హిందీని ఆమోదించాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇది భారతదేశ బహుళత్వంపై దాడి అని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లిష్, స్థానిక భాషల్లోనే కాకుండా, తప్పకుండా హిందీలోనే మాట్లాడాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశం ఒక వసుదైక కుటుంబమని పేర్కొన్న కేటీఆర్.. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని స్పష్టం చేశారు.
మన దేశంలోని ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్రజల నిర్ణయానికే వదిలేయాలని ఆయన హితవు చెప్పారు. దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ్వకూడదంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్ అవుతాయని కేటీఆర్ హెచ్చరించారు.
“నేను మొదట భారతీయుడిని.. ఆ తర్వాతే గర్విచందగ్గ తెలుగువాడిని, తెలంగాణవాడిని” అని కేటీఆర్ తన ట్వీట్లో స్పష్టం చేశారు. “నా మాతృభాష తెలుగులో నేను మాట్లాడగలను. అయినప్పటికీ ఇంగ్లిష్, హిందీతో పాటు కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను” అని కేటీఆర్ తెలిపారు.
దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లిష్ భాషను నిషేధించడం వంటి ప్రతిపాదనలు యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని కేటీఆర్ హెచ్చరించారు.
ఇప్పటికే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారతదేశ భిన్నత్వంపై దాడి అంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. అంతేకాదు హిందీ సామ్రాజ్య వాదం దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశాయి.
రాజ్‌నాథ్ సింగ్ హోం మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో పేర్కొన్నట్లు హిందీ ‘రాజ్ భాష’ (అధికారిక భాష) అని.. ‘రాష్ట్ర భాష’ (జాతీయ భాష) కాదని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వాదించారు.
‘హిందీ సామ్రాజ్యవాదం దేశానికి మరణశాసనం అవుతుంది. నేను హిందీతో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను, కానీ అందరూ హిందీ మాట్లాడాలనుకోను. అమిత్ షా వ్యాఖ్యలు హిందీకి కీడు చేసేలా ఉన్నాయి’ అని జైరాం రమేష్ ట్విట్టర్లో హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. హోంమంత్రి హిందీ గురించి మాట్లాడకూడని ఉపన్యాసం ఇచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అమిత్ షా హిందీ గురించి ప్రబోధించడానికి ప్రయత్నించారు. హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం.. విభజన రాజకీయాలను పురిగొల్పడమే. హిందీ అంశాన్ని లేవనెత్తడం ద్వారా.. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి హోం మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అమిత్ షా ప్రకటనపై డిఎంకె ఎంపీ కనిమొళి కూడా తీవ్రంగా స్పందించారు. ఒకే భాష అనే ఆలోచనను తీసుకురావడం వల్ల దేశాన్ని ఏకం చేయడం ఏమో కానీ, ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయని ఆమె హెచ్చరించారు. హిందీ వ్యతిరేక ఉద్యమాల చరిత్ర, దాని కోసం చేసిన త్యాగాల గురించి కేంద్ర ప్రభుత్వం, మంత్రులు తెలుసుకోవాలని ఆమె హితవు చెప్పారు.
అమిత్ షా ప్రకటన దిగ్భ్రాంతి కలిగించిందని పీఎంకే నేత రాందాస్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు అర్థం హిందీ రుద్దడమే తప్ప మరోటి కాదని స్పష్టం చేశారు. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు, వారి భావాలను గౌరవించాలని కోరారు.