శనివారం అర్ధరాత్రి జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఓటమి పాలైంది. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరి వరకూ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహణను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. విదేశీ కుట్రలో పాలుపంచుకోలేమంటూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ప్యానల్ స్పీకర్ అయాజ్ సాధిక్ ఓటింగ్ నిర్వహించారు
అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ చరిత్రలో నిలిచిపోతారు. ఉదయం నుండి ఓటింగ్‌ను వాయిదా వేసేందుకు అన్ని రకాలుగా ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించారు. ముందే చెప్పిన్నట్లు చివరి బాల్ వరకు పదవి కాపాడుకోవడం కోసం ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు.
సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీ.. అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్‌ను సాగనంపింది. ఓటింగ్ సందర్బంగా పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీకి 172 మంది బలం కావాల్సి ఉండగా అధికార పార్టీకి 2 ఓట్లు తగ్గాయి. దీంతో ఇమ్రాన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
శనివారం ఉదయం నుండి అర్థరాత్రి వరకు పాక్ పార్లమెంట్లో అనూహ్య పరిణామాలు, హైడ్రామా నడిచాయి. ఉదయం నుండి ఓటింగ్‌ను నిలిపివేసేందుకు ప్రయత్నించగా.. సాయంత్రం సభ వాయిదా పడింది. తిరిగి రాత్రి సభ కొనసాగింది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓటింగ్ పెట్టేందుకు చివరి నిమిషం వరకూ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వం ససేమీరా అంది. తొలుత ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తుల కుట్రపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేసింది.
శనివారం రాత్రి ఇమ్రాన్‌ఖాన్ అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇమ్రాన్ మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాలు పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. చివరికి రాత్రి 10 గంటల తర్వాత ఇమ్రాన్ ఖాన్ నేషనల్ అసెంబ్లీలోని తన చాంబర్‌కు చేరుకున్నారు.
అంతకు ముందు ప్రధాని నివాసంలో ఇమ్రాన్‌తో స్పీకర్ సమావేశమై తాజా పరిస్థితులపై చర్చలు జరిపా రు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ వెలుపలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మీ బలగాలు భారీ సంఖ్యలో ఇస్లామాబాద్‌లో మోహరించాయి.
ఇస్లామాబాద్, లాహోర్ తదితర నగరాల్లో ఇమ్రాన్‌కు అనుకూల, వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. మరోవైపు చివరి నిమిషం వరకూ అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించకపోవడంతో అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్ సుప్రీంకోర్టు అత్యవసరంగా సమావేశమైంది. తమ ఆదేశాలను స్పీకర్ పాటించకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద విచారణ జరిపింది.
అర్థరాత్రి జరిగిన ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ ఓటమిని చవిచూడక తప్పలేదు. తదుపరి ప్రధానిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అధినేత, నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
దేశం ఆర్థిక సంక్షోభం కూరుకుపోవడంతో, అవినీతి వంటి ఆరోపణలపై సొంత పార్టీ (తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ)కి చెందిన నేతలే ఆయనపై తిరుగుబావుటా ఎగురవేశారు. దీనికి తోడు.. కూటమిలోని కొన్ని పార్టీలు సైతం మద్దతును ఉపసంహరించుకోవడంతో అధికార పార్టీ మెజార్టీని కోల్పోయింది.
దీంతో ప్రతిపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యాయి. అంతలోనే స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చుతూ.. పార్లమెంట్‌ను రద్దు చేయగా.. ఇమ్రాన్ ఖాన్ మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని కోరగా కేంద్ర ఎన్నికల కమిషన్ సాధ్యం కాదని తేల్చేసింది.
స్పీకర్ నిర్ణయంపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దీంతో ఖంగుతిన్న ఇమ్రాన్ ఖాన్… శనివారం అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ సార్వభౌమాత్యాన్ని కాపాడాలని, దిగుమతి చేసుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
విదేశీ శక్తులు తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇందులో భాగంగానే పాకిస్తాన్ చట్టసభ్యులు గొర్రెల్లా అమ్ముడుపోయారని ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా దౌత్యవేత్తలు.. తమ నేతలను కలుసుకున్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుయుక్తులు జరుగుతున్నాయని తెలిసిందని మండిపడ్డారు.
ఇక్కడి ప్రభుత్వ పతనాన్ని సంబంరాలు చేసుకుంటున్నాయంటూ మీడియాపై కూడా ధ్వజమెత్తారు. విదేశీ శక్తుల చేతిలో కీలుబమ్మగా మారే ప్రధాని కావాలని కోరుకుంటున్నందున, తనను గద్దె దించాలని భావిస్తున్నారని విమర్శలు చేశారు. దేశంలో నెలకొన్న అనిశ్చితిపై మాట్లాడుతూ.. పాకిస్తాన్ సార్వభౌమాధికారంపై దాడిగా ఆయన అభివర్ణించారు