ఇంధన ధరల పెరుగుదల గురించి ఎదురైన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీ గుహవటి విమానంలో ప్రయాణిస్తున్న స్మృతి ఇరానీని కాంగ్రెస్ నేత నెట్టా డిసౌజా ఈ ప్రశ్న అడిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
తన ఇంటర్వ్యూని కేంద్ర మంత్రి కూడా వీడియో తీశారంటూ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ యాక్టింగ్ చీఫ్గా వ్యవహరిస్తున్న నెట్టా డిసౌజా ట్విటర్లో పేర్కొన్నారు. మంత్రి స్మృతి ఇరానీ గౌహతికి వెళ్లే విమానంలో ఆమెకు ఎదురయ్యారు. తీవ్రంగా పెరుగుతున్న ఎల్పిజి ధరలపై ప్రశ్న అడిగినపుడు ఆమె స్పందించిన తీరు చూడండి అంటూ ట్వీట్ చేశారు.
‘‘గౌహతి వెళ్తున్న సమయంలో మోదీ కేబినెట్లో మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ కలిశారు. పెట్రో ధరల పెంపు పై ప్రశ్నించాను. దీంతో వ్యాక్సిన్లు, రేషన్తో సహా పేదలను నిందించారు. ఈ వీడియోను చూడండి’’ అంటూ కాంగ్రెస్ నేత డిసౌజా ట్వీట్లో పేర్కొన్నారు.
వ్యాక్సిన్లు, పేదలు, రేషన్ల కారణంగానే ధరలు పెరుగుతున్నాయటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోపై స్మృతి ఇరానీ స్పందించారు. విమానం నుండి దిగుతుండగా డిసౌజా తనను అడ్డుకున్నారని, గ్యాస్ కొరత, గ్యాస్ లేకుండా స్టవ్స్ గురించి ప్రశ్నలు అడిగారని తెలిపారు. దానితో అసత్యాలు ప్రచారం చేయకండని తాను సూచించినట్లు చెప్పారు. కేంద్రం పెట్రోల్ ధరలను 14 సార్లు పెంచడంతో 16 రోజుల్లో రూ. 10 పెరిగి ప్రస్తుతం లీటరు పెట్రోల్ సెంచరీని దాటింది.