ఎర్రజెండా అండతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆగడాలను తిప్పికొట్టాలని దేశ ప్రజానీకానికి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. కేరళలోని కన్నూరులో ఈనెల ఆరు నుంచి ఐదు రోజులపాటు కొనసాగిన సీపీఎం అఖిల భారత 23వ మహాసభల ముగురింపు సందర్భంగా జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ ఒకవైపు మతోన్మాదం..మరోవైపు ఆర్థిక భారాలు.. ఇంకోవైపు ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మటం.. దీంతోపాటు రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు పనిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
సరళీకృత ఆర్థిక విధానాలకు మతోన్మాదాన్ని జోడించటం ద్వారా అది ‘ప్రజలను విభజించి,పాలించు’ అనే తన అజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ ప్రజలను లూఠీ చేస్తోందని చెప్పారు. మరోవైపు రాజకీయాల్లోకి మతాంశాలను జప్పించటం ద్వారా ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తోందని విమర్శించారు.
రాజ్యాంగ మూల సూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమాఖ్య వ్యవస్థ, ఆర్థిక స్వావలంబన అనే అంశాలను నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీపీఎంతోపాటు ఇతర వామపక్షాలు, లౌకికత్వ శక్తులు బీజేపీ విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ పోరులో తమ పాత్ర గురించి ఆలోచించుకోవాలని సెక్యులర్ పార్టీలకు ఆయన హితవు పలికారు.
ప్రధాని మోదీ `కమ్యూనిస్టు పార్టీలు దేశంలో ఒక మూలకే (కేరళ)కే పరిమితమయ్యాయంటూ మాట్లాడారని గుర్తు చేస్తూ `వాస్తవానికి మాకున్న సైద్ధాంతిక పటుత్వమే మిమ్మల్ని, మీ పార్టీనీ గద్దె దించుతుంది…’ అని హెచ్చరించారు. ఈ క్రమంలో కేరళలోని సీపీఎం, ఇతర కమ్యూనిస్టు పార్టీలు దేశానికి మార్గదర్శనం చేస్తున్నాయని ఏచూరి కొనియాడారు.
మూడోసారి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు సీతారాం ఏచూరి. సీపీఎం 23వ కాంగ్రెస్ సదస్సులో ఆదివారం పార్టీ పొలిట్‌బ్యూరోను ఎన్నుకున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో పొలిట్‌బ్యూరోను పార్టీ ఎన్నుకుంది.
ఈ ఎన్నికలో పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత రామ్ చంద్ర డోమ్‌ను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. దళిత నేతకు ఈ పదవి దక్కడం పార్టీలో ఇదే తొలిసారి. పార్టీ పదవుల కోసం గరిష్ట వయసు 75గా నిర్ణయించడంతో కొందరు సీనియర్లు పోటీ చేయలేదు. మరోవైపు సెంట్రల్ కమిటీలో గతంలో 95 మంది ఉండగా, తాజాగా 85 మందితోనే కమిటీని నిర్ణయించారు. తాజా కమిటీలో మొత్తం 17 మంది కొత్తవాళ్ల ఉండగా, 15 మంది మహిళలకు చోటు కల్పించారు.
పొలిట్ బ్యూరో సభ్యులు
1. సీతారాం ఏచూరి, 2. ప్రకాశ్ కరత్, 3. మాణిక్ సర్కార్, 4. పినరయ్ విజయన్, 5. బి.వి రాఘవులు, 6. బృందాకరత్, 7. కొడియారి బాలకృష్ణన్, 8. ఎం.ఎ బేబి, 9. సూర్యకాంత మిశ్రా, 10. మహమ్మద్ సలీమ్, 11. సుబాషిణి ఆలీ, 12. జి. రామకృష్ణన్, 13. తపన్‌సేన్, 14. నిలోత్పల్ బసు 15. విజయ్ రాఘవన్ 16. అశోక్ ధావలే 17. రామచంద్రన్ డోమ్. వీరితో పాటు సెంట్రల్ కమిషన్ చైర్మన్ గా ఎకె పద్మనాభన్ ను ఎన్నుకున్నారు.
కొత్త కేంద్ర కమిటీలో 17 మంది కొత్తగా ఎన్నికయ్యారు. కమిటీలో 15 మంది మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బి.వి రాఘవులు, ఎస్.పుణ్యవతి, వి. శ్రీనివాసరావు, ఎం.ఎ. గఫూర్ ఎన్నికయ్యారు. తెలంగాణా నుంచి కేంద్ర కమిటీలో సభ్యులుగా తమ్మినేని వీరభద్రం, సి.హెచ్. సీతారాములు, జి. నాగయ్య, అరుణ్ కుమార్, బి. వెంకట్ ఎన్నికయ్యారు.