మొత్తం 24 మంది మంత్రులతో రాజీనామా చేయించి, మూడు రోజులపాటు కసరత్తు చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రమాణస్వీకారం చేయబోయే 25 మంది మంత్రుల జాబితాను ప్రకటించగానే రాష్ట్రంలో పలుచోట్ల అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. మొదటిసారిగా, వైసిపి శ్రేణులు పార్టీ నాయకత్వంపై ఆగ్రవేశాలతో రోడ్లపైకి వచ్చి, నిరసనలు తెలిపారు.
పలుజిల్లాల్లో ఎమ్మెల్యేలు, వారి అనుచరులు రోడ్డెక్కారు. మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకున్న తమకు జగన్మోహన్రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోయారు మనస్థాపంతో కంటతడిపెట్టుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు ఫోన్లను స్విచాఫ్ చేసుకొని ఎవరినీ కలవకుండా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఎమ్మెల్యేలకు మద్దతుగా పలు నియోజకవర్గాల్లోని తాము ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులతోపాటు పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుండగా వారి అనుచరులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.
మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు రోడ్లపై ఆందోళన, వాహనాలు ధ్వంసం చేశారు. రింగ్ రోడ్డు సెంటర్ లో బైక్ ని తగ్గలబెట్టి ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యకర్తలు భారీగా రోడ్లపైకి వచ్చారు. పిన్నెల్లికి మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తిని వెల్లగక్కారు. మంత్రివర్గంలోకి తీసుకోకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ కిషోర్‌తో పాటు కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రకటించారు. .
ముఖ్యమంత్రి సమీప బంధువు, ‘మాజీ’గా మారిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. తనను కేబినెట్ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారు.
బాలినేనిని బుజ్జగించేందుకు ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా అధిష్ఠానం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మంత్రి పదవి విషయంలో తనను నమ్మించి మోసం చేశారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.
బాలినేనికి మంత్రి పదవి దూరమైందని తెలిసి… నియోజకవర్గంలోని ఆయన అనుచరులు నిరసనలతో హోరెత్తించారు. ఒంగోలు మంగమూరు రోడ్డు జంక్షన్లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కొందరు కిందిస్థాయి నాయకులు పదవులకు రాజీనామాల ప్రకటనలు చేశారు.
కొత్తగా ఏర్పడ్డ ఎనిమిది జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వీటిలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలున్నాయి. కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ వంటి ప్రధాన కులాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు.. కోనసీమలో చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పినిపె విశ్వరూప్, ప.గో.జిల్లాలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ.. పల్నాడు జిల్లాలో అంబటి రాంబాబు, విడదల రజనిలకు మంత్రి పదవులు లభించాయి.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఆర్కే రోజాకు మంత్రి పదవులు దక్కాయి. అన్ని జిల్లాలకు సమాన ప్రాతినిథ్యం కల్పిస్తామన్న సీఎం జగన్ తన మాటను తానే నిలబెట్టుకోలేదని, మడమ తిప్పను, మాట తప్పను అంటూనే ఏపీ ప్రజలను వంచిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ బోర్డు డైరెక్టర్ దుద్దెల బాబు ఆదివారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడం.. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మనస్థాపం చెంది తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి మంత్రవర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కకపోవడంతో తిరుపతిలో చాలామంది వైసీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. దీనికి నిరసనగా తిరుపతి కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు.
మంత్రివర్గ విస్తరణపై నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రగిలిపోతున్నారు. తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోలేదంటూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి గెలిచినా రిక్తహస్తం చూపించారని ఆయన మనస్తాపానికి గురయ్యారు.
మంత్రి పదవి దక్కకపోవడంతో మీడియా ముందు కన్నీరు పర్యంతమైయ్యారు కోటంరెడ్డి. మంత్రి పదవిని ఆశించడం తప్పా అని ప్రశ్నించారు. పార్టీ కోసం కట్టుబడి పని చేశామని అంటూ సీఎం జగన్ ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అయితే తనను అసంతృప్తితో ఉన్నానని స్పష్టం చేశారు, మోసం, అబద్దాలు చెప్పడం తన నైజం కాదని, తన కడుపు మండుతోందని తెలిపారు.
తన ఎస్సీ సామాజిక వర్గంలోని మిగతా మినిస్టర్స్ అందరినీ కొనసాగిస్తూ.. తనను మాత్రం పదవి నుంచి తప్పించడానికి తాను ఏం తప్పు చేశానని మొన్నటి వరకు హోమ్ మంత్రిగా ఉన్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రశ్నిస్తున్నారు.
అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు మేకతోటి హర్షిత్, కుమార్తె రిషిక ఆదివారం రాత్రి గుంటూరులోని స్వగృహంలో మీడియా ముందు ప్రకటించారు. తమ తల్లి సుచరిత గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బయటకు రాలేకపోతున్నారని, రాజీనామా విషయాన్ని ఆమె తరఫున తాము తెలియజేస్తున్నామని చెప్పారు.
స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖపై సంతకం చేసి వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావుకు అందజేసినట్లు తెలిపారు. రెండు రోజులుగా తమ కుటుంబ సభ్యులు సజ్జల రామకృష్ణా రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా పట్టించుకోవడం లేదని పార్టీలో తమకు ఇదేనా ప్రయారిటీ అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరంలో వైసీపీ నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ధర్మశ్రీకి మంత్రి పదవి రాలేదంటూ ధర్మశ్రీ వర్గీయులు, వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వడ్డాదిలో నాలుగు రోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ వైసీపీ నేతలు రాజీనామా లేఖలను చూపించారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ముమ్మర యత్నాలు చేసిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు నిరాశే ఎదురైంది. జిల్లా నుంచి సీదిరి అప్పలరాజుకు రెండో చాన్సు దక్కగా.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు.
ఇంకోవైపు.. సుచరిత వర్గీయులు గుంటూరులో ఆందోళనకు దిగారు. ఆదివారం రాత్రి బ్రాడీపేటలోని క్యాంపు కార్యాలయం నుంచి లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు. టైర్లు తగలపెట్టి నిరసన తెలియజేశారు.‘డౌన్ డౌన్ సజ్జల.. పది రోజులుగా సీఎం అపాయింట్మెంట్ అడుగుతున్నా పట్టించుకోవటం లేదు.. ఆయన ఎవరు.. ఆయన అధికారాలేంటి’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.