పాకిస్థాన్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడవడానికి కొద్దీ సేపు ముందు ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాను తొలగించడానికి చివరి ప్రయత్నం చేసిన్నట్లు తెలుస్తున్నది.
ఆ ప్రయత్నం పసిగట్టిన బజ్వా స్వయంగా ఇమ్రాన్ ను కలసి `హెచ్చరించిన్నట్లు’ భావిస్తున్నారు. అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే, అడ్డుకోవడం కోసమే అర్ధరాత్రి హైకోర్టు, సుప్రీం కోర్టులు సమావేశమైన్నట్లు కూడా చేస్తున్నారు. పాకిస్థాన్ చరిత్రలో ప్రధానులు ఎవ్వరు పూర్తికాలం పదవిలో కొనసాగలేదు.
అయితే సైన్యం లేదా న్యాయస్థాన పక్రియ ద్వారా కాకుండా ప్రజాస్వామ్య ప్రకియలో మొదటిసారిగా పదవి పోగొట్టుకున్నది ఇమ్రాన్ కావడం విశేషం. రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చైనాతో అతని సాన్నిహిత్యం, అమెరికాతో వైరుధ్యాలతో పాటు తనను అధికారంలోకి తీసుకొచ్చిన సైన్యం పట్ల కొన్ని సందర్భాలలో ధిక్కార ధోరణి ప్రదర్శించడం వల్లననే అధికారం కోల్పోయిన్నట్లు పలువురు భావిస్తున్నారు.
పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా తీవ్రమైన రీతిలో ఎన్నికలలో రిగ్గింగ్ కు పాల్పడడం ద్వారా, సైన్యం మద్దతుతోనే 2018లో అధికారంలోకి రావడం గమనార్హం. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందుగా బజ్వాను తొలగించడానికి ఇమ్రాన్ ప్రయత్నం చేసాడని బిబిసి వార్తాకథనం వెల్లడిస్తున్నది.
ఈ కధనాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించినప్పటికీ ఈ విషయమై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. “ఇద్దరు అయాచిత అతిథులు” శనివారం రాత్రి హెలికాప్టర్లో ప్రధానమంత్రి ఇంటికి చేరుకుని దాదాపు 45 నిమిషాల పాటు ఖాన్‌ను ఏకాంతంగా కలిశారు” అని బిబిసి ఉర్దూ వార్తా కధనంపేర్కొంది, ఈ సమావేశానికి గంట ముందు, ఒక సీనియర్ అధికారిని తొలగించాలని ఖాన్ ఆదేశించారని తెలిపింది.
“అయితే, ఆ అధికారిని తొలగించడం, అతని వారసుడిని నియమించడం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. ఆ విధంగా పదవీ విరమణ చేసిన ప్రధానమంత్రి విప్లవాత్మక ప్రయత్నం విఫలమైంది” అని ఆ కధనం వెల్లడించింది.
ఇది జరిగి ఉంటే, ఇది పాకిస్తాన్ చరిత్రలో ఓ అపూర్వమైన, సాహసోపేత సంఘటనగా నిలిచి ఉండేది. బహుశా అటువంటి ప్రయత్నం చేసి ఉంటె కోర్ట్ అడ్డుపడి ఉండెడిది. జనరల్ బజ్వాతో సుదీర్ఘ ఆధిపత్య పోరు సలపడంతోనే ఇమ్రాన్ పదవి పోగొట్టుకో వలసి వచ్చినదన్నది బహిరంగ రహస్యం.
గత ఏడాది ఐస్ఐ అధిపతిగా లెఫ్టనెంట్ జనరల్ ఫైజ్ హమీద్ ను తొలగించి లెఫ్టనెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ ను నియమించేందుకు బజ్వా పంపిన ఫైల్ పై సంతకం చేయకుండా ఇమ్రాన్ జాప్యం చేసాడు. ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన హమీద్ 2018లో ఇమ్రాన్ ప్రధానిగా గెలుపొందడంతో కూడా నిర్ణయాత్మక పాత్ర వహించారు.
ఆయనను ఆ పదవిలో కొనసాగించి, ఈ సంవత్సరం నవంబర్ లో బజ్వా రిటైర్ కాగానే ఆర్మీ చీఫ్ గా చేయాలని అనుకున్నాడు. ఆ విధంగా చేస్తే వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తాను తిరిగి ప్రధాని అయ్యేవిధంగా చూస్తాడని అంచనా వేసాడు. ఈ ఎత్తుగడను పసిగట్టే బజ్వా ముందుగానే హమీద్ ను తప్పించాడు.
ఇమ్రాన్ ఖాన్ ఆర్మీతో పలు సంబంధాలలో సైన్యంతో తనకు గల సన్నిహిత సంబంధాల గురించి ఎన్నో ప్రగల్భాలు పలికారు. అయితే పలు కారణాలతో వారి `విశ్వాసం’ కోల్పోవడంతో పదవి పోగొట్టుకోవలసి వచ్చింది. ప్రజలలో తనకున్న ప్రజాదరణ గురించి ఎక్కువగా అంచనా వేసుకొనే ఇటువంటి `దుస్సాహసం’ చేసాడని పరిశీలకులు భావిస్తున్నారు.
వాస్తవానికి ప్రధానిగా ఎంతో ప్రజాదరణ పొందాడని, అనుకున్నట్లు మధ్యంతర ఎన్నికలు జరిగితే తిరిగి ఎన్నికయ్యేవాడని పలువురు భావిస్తున్నారు. అయితే అప్రజాస్వామిక పద్దతిలో పనిచేయడం, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తూ అనేకమంది శత్రువులను సృష్టించుకున్నారని చెబుతున్నారు.
“అతను ఒక టీమ్ మనిషి కాదు. అతను పాకిస్తాన్‌ను అధ్యక్ష ప్రభుత్వంగా మార్చాలని కోరుకున్నాడు” అని అతని విమర్శకులు పేర్కొంటున్నారు. తన మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నించిన తీరు కూడా ‘పార్లమెంట్, రాజ్యాంగం ఆధిపత్యంపై ఇమ్రాన్‌కు నమ్మకం లేదు’ అనే ఆరోపణలకు బలం చేకూర్చిందని స్పష్టం చేస్తున్నారు.
తన చివరి రోజుల్లో, సర్వశక్తిమంతుడైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను తొలగించే ప్రయత్నంతో పాటు, ఇమ్రాన్ అపూర్వమైన రీతిలో అవిశ్వాస తీర్మానాన్ని ఓటింగ్ జరుపకుండా తిప్పికొట్టేందుకు చేసిన ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య ప్రకియ పట్ల విశ్వాసం లేని నేతగా గుర్తింపు తెచ్చింది. తనను గద్దె దించాలని అమెరికా, సైన్యం కుట్ర పన్నిన్నట్లు చేసిన ఆరోపణలు ఇమ్రాన్ భవిష్యత్ ను కఠినతరం చేసే అవకాశాలు సృష్టిస్తున్నాయి.