శ్రీరామనవమి పర్వదినాన దేశంలో పలు రాష్ట్రాల్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, బెంగాల్లో ఈ ఘర్షణలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ ప్రాంతంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో గొడవలు చోటుచేసుకున్నాయని, దీంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. తలాబ్ చౌక్ ప్రాంతం నుండి ప్రారంభమైన ఊరేగింపు సందర్భంగా లౌడ్ స్పీకర్లను అమర్చగా, దీనిపై ఘర్షణ జరిగి రాళ్లు రువ్వడం, వాహనాలను తగుల బెట్టడం వరకు వెళ్లిందని అదనపు కలెక్టర్ ఎస్ఎస్ మజుల్దే తెలిపారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు టియర్ గ్యాస్‌లను వినియోగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పలు ఇళ్లకు సైతం నిప్పంటించారని చెప్పారు. ఈ ఘర్షణల్లో ఎస్పితో సహా పలువురు పోలీసులు గాయపడ్డారు.
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా ఖంబాట్, సబర్కాంత జిల్లా హిమ్మత్‌నగర్‌లలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని వార్తలు వెలువడ్డాయి. ఖంబాట్లో రెండు గ్రూపుల మధ్య గొడవలు జరగ్గా.. 65 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ రెండు చోట్ల రాళ్లు రువ్వడం, నిప్పంటించడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ కూడా ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయవులను ప్రయోగించాల్సి వచ్చింది.
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీలోని కావేరీ హాస్టల్లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ నెలకొంది.
శ్రీ రామనవమి ఉత్సవాలు నిర్వహణకు అడ్డంకి కల్పించడం కోసం వామపక్ష విద్యార్థులు అనవసరపు రాద్ధాంతం సృష్టించారని ఎబివిపి నేతలు ఆరోపించారు. అయితే హాస్టల్ లో మాంసాహారం వండవద్దని దౌర్జన్యానికి పాల్పడ్డారని వామపక్షుల విద్యార్థులు విమర్శించారు.
అటు బెంగాల్‌లోని హౌరా, షిబ్‌పూర్‌లో కూడా శ్రీరామనవమి ఉత్సవాల్లో ఘర్షణలు నెలకొన్నాయి. ఊరేగింపుపై పోలీసులు దాడి చేశారని ప్రతిపక్ష బిజెపి ఆరోపిస్తుంది. ఊరేగింపులో పాల్గన్న వారిపై పోలీసు సిబ్బంది లాఠీలతో చితకబాదారని బిజెపి నేత సువేందు అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో కూడా పలు చోట్ల మతఘర్షణలు జరిగాయన్న వార్తలు వెలువడ్డాయి. లోహర్దగాలో జరిగిన గొడవలో అనేక మంది గాయపడగా, ముగ్గురు పరిస్థితి విషమమని తెలుస్తోంది.